ఎన్నికల కమిషన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్ తో అనుసంధానం చేయాలని కోరుతూ న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాయడం గమనార్హం. ఈ అంశంపై ఈసీ న్యాయశాఖకు లేఖ రాయడం ఇదే తొలిసారి.

దీంతోపాటు ప్రజా ప్రాతినిధ్య  చట్టం 1950కి మార్పులు చేయాలని కూడా ఈసీ ప్రతిపాదించింది. ఓటర్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయడం వల్ల నకిలీ దరఖాస్తులు, బోగస్ ఓట్లను సులభంగా ఏరివేయవచ్చని పేర్కొంది. ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం వల్ల ఒక్కొక్కరినీ ఒక్క ఓటు మాత్రమే పరిమితం చేయవచ్చంటూ చాలా కాలంగా ఈసీ చెబుతూ వస్తోంది.

గతంలో ఆధార్ అనుసంధానం స్వచ్ఛందం అని చెప్పిన ఈసీ 2016లో  ఏకే జోషి  ప్రధాన ఎన్నికల కమిషనర్ గా వచ్చిన తర్వాత తన వైఖరి మార్చుకోవడం గమనార్హం. కాగా ఇప్పటికే 32కోట్ల ఆధార్ నంబర్లు ఓటర్ ఐడీ కార్డులతో లింక్ అయ్యాయి.