తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ఈ రోజు సాయంత్రం ప్రకటించనుంది. ఈ రాష్ట్రాల్లో ఏప్రిల్-మే నెలల్లో  ఎన్నికలు జరగనున్నాయి.

వీటితో పాటు తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోకసభ స్థానానికి కూడా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

బీహార్ ఎన్నికల తరువాత కరోనావైరస్ నేపథ్యంలో జరగబోతున్న మొదటి ప్రధాన ఎన్నికలు ఇవే. పశ్చిమ బెంగాల్‌లో 294 సీట్లు, తమిళనాడులో 234 సీట్లు, కేరళలో 140 సీట్లు, అస్సాంలో 126 సీట్లు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 సీట్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు బీజేపి మారడం, టీఎంసీ నాయకులపై అవినీతి ఆరోపణలు.. ఇలాంటి వాటితో రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మమతా బెనర్జీ బీజేపీ నుంచి గట్టి సవాళ్లనే ఎదుర్కుంటోంది. 

ఇక మరో వైపు అస్సాంలో 2016 లో కాంగ్రెస్ ను ఓడించి, తొలిసారిగా బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఈ సారి కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలని దూకుడుగా ప్రచారం చేస్తోంది. 

ఇక ఈ రాష్ట్రాల్లో 2016లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ను మాత్రమే పుదుచ్చేరి దక్కించుకోగలిగింది. అయితే ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన నాటకీయ పరిణామాలతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. మధ్యప్రదేశ్, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్ చిక్కుల్లో పడుతోంది.