న్యూఢిల్లీ: దేశమంతా ఒకే సమయంలో ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ ఆరోరా స్పష్టం చేశారు. దేశంలో జమిలి ఎన్నికల విషయమై ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించిన నెల రోజుల తర్వాత ఈ విషయమై ఆరోరా స్పందించారు.

సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ ఆరోరా మీడియాతో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

వన్ నేషన్, వన్ పోల్  కోసం ఒకే ఓటర్ జాబితా ఉండాలని మోడీ కోరారు. దేశంలో ప్రతి కొన్ని నెలలకు ఒసారి ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ది కార్యక్రమాలపై పడుతోందన్నారు.ప్రతి కొన్ని నెలలకు వేర్వేరు ప్రదేశాలలో ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ది పనులకు ఆటకం కలిగే అవకాశం ఉందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలో ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన కొత్తది కాదు. కానీ దేశంలో ఇతర నాయకుల కంటే మోడీ దీని కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.2015లో ఈఎం సుదర్శన్ నాచియప్పన్ నేతృృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడ ఏక కాలంలో ఎన్నికలకు సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

2018లో లా కమిషన్ తన ముసాయిదా నివేదికలో క్యాలెండర్ సంవత్సరంలో అన్ని ఎన్నికలు కలిసి నిర్వహించాలని సిఫారసు చేసింది.కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు ఒకేసారి దేశంలో ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా లేవు.ఇది అసాధ్యమైన ఆలోచనగా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.