ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ గుర్తును ఏక్‌నాథ్ షిండేకు అప్పగించిన తర్వాత ఈసీపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీకి ఈసీ బానిస అని ఆరోపించారు. 

ముంబయి: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే శనివారం ఎన్నికల సంఘంపై తీవ్రరూపంలో మాటలతో దాడికి దిగారు. ఎలక్షన్ కమిషన్ ప్రధాని మోడీకి బానిస అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది వరకు ఎప్పుడూ చేయని ఓ పనిని ఇప్పుడు ఎన్నికల సంఘం చేసిందని ఆరోపణలు చేశారు. తన మద్దతుదారులు సహనంతో ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల కోసం సిద్ధం కావాలని అన్నారు.

ఠాక్రేల నివాసమైన మాతో శ్రీ ఎదుట భారీ జన సందోహాన్ని ఆయన ఉద్దేశిస్తూ మాట్లాడారు. బాల్ ఠాక్రేను గుర్తుకు తెచ్చేలా కారులో సన్ రూఫ్ నుంచి బయటకు కనిపిస్తూ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. శివసేన పార్టీ గుర్తును, పేరును దొంగలు దోచుకెళ్లారని అన్నారు. వారికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను పరోక్షంగా పేర్కొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు.

శివసేన పార్టీ గుర్తు, పార్టీ పేరును ఎన్నికల సంఘం ఏక్‌నాథ్ షిండేకే చెందుతుందని స్పష్టం చేసింది. విల్లు బాణాన్ని ఏక్‌నాథ్ ఠాక్రే వర్గానికి కేటాయించింది. శివసేన పార్టీని 1966లో బాల్ ఠాక్రే స్థాపించిన సంగతి తెలిసిందే.

Also Read: ఘనంగా వేములవాడ రాజన్న జాతర.. పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

పార్టీ పేరు, గుర్తులపై ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేల వర్గం సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్నారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఉద్ధవ్ ఠాక్రే కోరారు. కానీ, ఈసీ అందుకు నిరాకరించింది. ఈసీ నిర్ణయాన్ని తాము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. 

40 సేన ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండే.. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. అతను బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ప్రతిపక్షంలోని బీజేపీ అధికారంలోకి, అధికారంలోని మహా వికాస్ అఘాదీ విపక్షంలోకి వచ్చి చేరింది. అనంతరం, పార్టీ గుర్తుపై పోరు మొదలైంది. సుమారు ఎనిమిది నెలలుగా ఈ పోరు ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండేల మధ్య జరుగుతున్నది.