2014 ఎన్నికల సమయంలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌ గురయ్యాయని దాని వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఆ  తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ట్యాంపరింగ్‌ వల్ల గెలిచిందంటూ కథనాలు వస్తుండటంతో దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

దీంతో మరోసారి ఈవీఎంల వినియోగంపై అనుమానాలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెట్ పేపర్ వాడే ప్రసక్తే లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా తెలిపారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ పార్టీలు ఈవీఎంల పనితీరుపై వ్యక్తం చేస్తున్న అనుమానాలను కొట్టిపారేశారు.  మనదేశంలో వినియోగించే ఈవీఎంలను ఎవరూ హ్యాక్ చేయలేరని పేర్కొన్నారు.

ఈవీఎంలను హ్యాక్ చేయలేనప్పుడు బ్యాలెట్ పేపర్లను ఎందుకు వినియోగించాలని ఆరోరా ప్రశ్నించారు. బీఈఎల్, ఈసీఐఎల్ రూపొందించే ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య రూపొందిస్తామని, సాంకేతిక కమిటీ సమక్షంలో నిబంధనల మేరకు ఈ యంత్రాలను కఠినమైన పరీక్షలకు లోను చేస్తామని వెల్లడించారు.