దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.

దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. మొయిన్‌పురి లోక్ స్థానంతో పాటు, ఐదు అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన పోలింగ్ జరుగుతుందని తెలిపింది. అన్ని ఉప ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ 8న నిర్వహించనున్నారు. ఉప ఎన్నికలు జరగనున్న ఐదు అసెంబ్లీ స్థానాలు.. ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో ఉన్నాయి. ఇక, సమాజవాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతితో మొయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది.

ఇక, 2022 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నేత అజాం ఖాన్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. 2019 విద్వేష ప్రసంగం కేసులో దోషిగా తేలిన ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ క్రమంలోనే ఆయనపై అనర్హత వేటు పడింది. ఇక, మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు- ఒడిశాలోని పదంపూర్, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్, బీహార్‌లోని కుర్హానీ, ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాపూర్ ఉన్నాయి.

ఇక, కేంద్ర ఎన్నిక సంఘం ప్రకటన ప్రకారం.. ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ నవంబర్ 10 న జారీ చేయబడుతుంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి నవంబర్ 17 చివరి తేదీ. అదేవిధంగా.. నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన జగనుంది. అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 21 చివరి తేదీ. డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించనుండగా.. 8వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.