గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్టుగా వెల్లడించారు. మొదటి విడత పోలింగ్.. డిసెబర్ 1 వ తేదీన జరగనుండగా.. రెండో విడత పోలింగ్.. డిసెంబర్ 5వ తేదీన జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8వ తేదీన చేపట్టనున్నారు.
తొలి విడతలో 89 అసెంబ్లీ నియోజవర్గాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 5వ తేదీన వెలువడనుంది. ఆ రోజు నుంచి నవంబర్ 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 15వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్‌ల ఉపసంహరణకు నవంబర్ 17ను గడువుగా నిర్ణయించారు. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది.
రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 10వ తేదీన వెలువడనుంది. ఆ రోజు నుంచి నవంబర్ 17వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 18వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్‌ల ఉపసంహరణకు నవంబర్ 21ను గడువుగా నిర్ణయించారు. డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 3,24,422 మంది కొత్త ఓటర్లు తొలిసారి ఓటు వేస్తారని తెలియజేయడానికి సంతోషిస్తున్నానని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం 51,782 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో కనీసం 50 శాతం కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేయనున్నట్టుగా వెల్లడించారు.
మొత్తం ఓటర్లు - 4,90,89,765
పురుషులు - 2,53,36,610
స్త్రీ - 2,37,51,738
సర్వీస్ ఎలక్టర్లు - 27,943
80 సంవత్సరాలు పైబడినవారు- 9,87,999
పీడబ్ల్యూడీ - 4,04,802

ఇక, 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 18తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అప్పటిలోగా ఈసీ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనుంది. గతంలో 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 77 స్థానాల్లో విజయం సాధించింది. భారతీయ గిరిజన పార్టీ (బీటీపీ) కేవలం 2 సీట్లు, ఎన్సీపీకి ఒక్క సీటు మాత్రమే దక్కాయి. మూడు చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటకే కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 12న పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ తేదీకి, కౌంటింగ్‌కు మధ్య ఇంతా గ్యాప్ ఉంచినట్టుగా తెలుస్తోంది.
