తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లిని పదేళ్లుగా ఇంటిలో నిర్బంధించారు. ఆకలైతే.. బిస్కెట్లు, పండ్లు విసిరేయాలని ఇరుగపొరుగు వారికి చెప్పి బయటి నుంచి ఇంటికి లాక్ వేశారు. దీనస్థితిలో నగ్నంగా ఉన్న ఆ పెద్దావిడ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

చెన్నై: ఆమెను పదేళ్లుగా నిర్బంధించారు. ఆకలై అరిస్తే పొరుగువారు బిస్కెట్లు, ఫ్రూట్స్ విసిరేవారు. అవి తిని చాలీ చాలని ఆహారంతో కడుపు నింపుకుని రోజులు వెళ్లదీసింది. నగ్నంగా ఇన్నేళ్లు ఆమె ఇంటికే పరిమితం అయ్యారు. ఆమెకు ఇద్దరు ‘సుపుత్రులు’ ఉన్నారు. ఆ ఇద్దరూ వెల్ సెటిల్డ్. ఒకరు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో మరొకరు దూరదర్శన్‌లో కొలువులో ఉన్నారు. కానీ, తల్లి యోగక్షేమాల కోసం పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఆమె చివరి దశల్లో రోజులు దుర్భరంగా మారాయి. ఈ ఘటనపై సమాచారం
తెలుసుకున్న సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆమెను ఆ గృహ నిర్బంధం నుంచి విడుదల గావించారు. ఈ ఘటనలో తమిళనాడులో చోటుచేసుకుంది.

ఆమె పేరు జ్ఞానజోతి. ఆమె వయసు సుమారు 72 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు. 50 ఏళ్ల శణ్ముగ సుందరం పెద్ద కుమారుడు. చెన్నైలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. కాగా, చిన్న కుమారుడు 45 ఏళ్ల వెంకటేశన్. ఆయన పట్టుకొట్టాయ్‌లో దూరదర్శన్‌లో పని చేస్తున్నాడు.

సోషల్ మీడియాలో ఓ వీడియో ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. దుర్భర పరిస్థితుల్లో ఓ ముసలావిడ నగ్నంగా దీనంగా ఆ వీడియోలో కనిపిస్తున్నారు. ఆ ఇల్లును వీడియోలో గుర్తించేట్టుగా ఉన్నది. దీనిపై ఓ అనామకుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించాడు. ఆ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆమెను ఆ గృహం నుంచి విడుదల చేశారు. తమిళ్ యూనివర్సిటీ పోలీసులు ఆమె ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశారు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్
పేరెంట్స్‌లోని సెక్షన్ 24 కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై శణ్ముగ సుందరం స్పందిస్తూ.. తన తల్లి నిర్బంధంతో తనకు సంబంధం లేదని, తప్పును తన తమ్ముడిపైకి నెట్టేశారు. ప్రతి నెల తన తల్లికి వచ్చే రూ. 10 వేల పెన్షన్‌ను తన తమ్ముడే తీసుకుంటున్నాడని, కాబట్టి, అందుకు బాధ్యుడు తన తమ్ముడేనని ఆరోపించారు.

ఆ పెద్దావిడను తంజావూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చేర్చినట్టు జిల్లా కలెక్టర్ దినేశ్ పొన్‌రాజ్ తెలిపారు. ఆమెకు చికిత్స అందించి వెంటనే కోలుకునేలా చేయాలని వైద్యులను కోరినట్టు చెప్పారు. 

తల్లి ఆకలి కోసం అరిచినా.. అడిగినా బిస్కెట్లు, ఫ్రూట్స్ ఆ తాళం వేసిన ఇంటిలోకి విసిరేయాలని ఇరుగు పొరుగు వారిని ఆ ముసలావిడ కుమారులు కోరినట్టు స్థానికులు అధికారులకు తెలిపారు. ఆమె దుస్థితి గురించి పొరుగువారికి తెలుసు అని, కానీ, అధికారులకు చెప్పడానికి భయపడ్డారని వివరించారు.