Unnao: ఎగ్జామ్ సెంట‌ర్ లో విద్యార్థికి బ‌దులు మ‌రో యువ‌కుడు ప‌రీక్ష‌లు రాస్తుండ‌గా అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచార‌ణ‌లో ఆ యువ‌కుడు అస‌లైన విద్యార్థి అన్న‌గా గుర్తించారు. త‌న త‌మ్ముడికి డ్రాయింగ్ స‌రిగా రాక‌పోవ‌డంతో అత‌ని త‌ర‌ఫున ప‌రీక్ష రాయ‌డానికి వ‌చ్చాన‌ని ఆ యువ‌కుడు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించడం గమనార్హం.   

UP Board Exam: త‌న త‌మ్ముడు ప‌రీక్ష‌ల‌కు స‌రిగ్గా సిద్ధం కాలేదనీ, అత‌నికి డ్రాయింగ్ చేయ‌డం స‌రిగ్గా రాద‌నీ, అత‌ని బాధ‌ను చూసిన ఓ సోద‌రుడు త‌న త‌మ్ముడికి సాయం చేయ‌ల‌నుకున్నాడు. దీని కోసం అత‌ని ప‌రీక్ష‌లు రాయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. అనుకున్న‌ట్టుగానే త‌మ్ముడి ప్లేస్ లో ప‌రీక్ష రాయ‌డానికి ఎగ్జామ్ సెంట‌ర్ కు వెళ్లాడు. అయితే, ప‌రీక్ష రాస్తున్న‌ది అస‌లు విద్యార్థి కాద‌ని గుర్తించిన అధికారులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. ఉన్నావోని షెర్పూర్ ఖ‌లాన్ లో యూపీ బోర్డు ఎగ్జామ్ ప‌రీక్ష‌ల క్ర‌మంలో త‌న త‌మ్ముడి ఎగ్జామ్ ను సోదరుడు రాస్తున్నాడ‌ని అధికారులు గుర్తించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. షాదాబ్ అనే నిందితుడు తన తమ్ముడి డ్రాయింగ్ సరిగా రాద‌నీ, అందుకు అత‌ని ఎగ్జామ్ రాయ‌డానికి తాను వ‌చ్చాన‌ని చెప్పాడు. మొదటి షిఫ్ట్ లో షాదాబ్ ముస్తాబాద్ లోని శకుంతలా దేవి కాశీరాం విద్యాలయంలోని పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. దాదాపు అరగంట పాటు ప‌రీక్ష రాశాడు. అయితే, కొంత స‌మ‌యం త‌ర్వాత‌.. స్టాటిక్ మేజిస్ట్రేట్ బృందంతో కేంద్రానికి చేరుకున్నారు.

అసలు అభ్యర్థి ముకీమ్ స్థానంలో షాదాబ్ పరీక్ష రాస్తున్నట్లు పరిశీలనలో గుర్తించారు. అత‌న్ని అదుపులోకి తీసుకుని విచారించ‌గా, తన తమ్ముడి డ్రాయింగ్ చేయ‌డం రావ‌డం లేద‌నీ, అందుకే తన తరఫున ప‌రీక్ష రాయ‌డానికి హాజరుకావాలని నిర్ణయించుకున్నానని షాదాబ్ స్టాటిక్ మేజిస్ట్రేట్ రామ్ లఖన్ కు చెప్పాడు. దీంతో షాదాబ్ ను పోలీసులకు అప్పగించారు. విచార‌ణ అనంతరం సెంటర్ ఇన్ చార్జి వర్షరాణి మిశ్రా ఫిర్యాదు మేరకు షాదాబ్ పై కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు కొత్వాలి ఇన్ స్పెక్ట‌ర్ జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు. నిందితుడిపై ఫ్రాడ్, చీటింగ్ కింద కేసు న‌మోదుచేసిన‌ట్టు వెల్లడించారు.

ఈ ఒక్క ప‌రీక్ష మాత్ర‌మే రాయ‌డానికి వ‌చ్చాడా? లేక ఇంత‌కు ముందు కూడా త‌మ్ముడి ప‌రీక్ష‌లు రాశాడా? అనేదానిపై కూడా సంబంధిత‌ అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు సెంటర్ ఇన్ చార్జి తెలిపారు. దీని కోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.