Asianet News TeluguAsianet News Telugu

ఏక్‌నాథ్ షిండేకు 34 ఎమ్మెల్యేల మద్దతు.. ఇంకా ఎంత మంది కావాలంటే?

ఏక్‌నాథ్ షిండేకు మద్దతు తెలుపుతూ 34 మంది రెబల్ ఎమ్మెల్యేల సంతకాలతో మహారాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు. అందులో 30 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరరో ఏడుగురు శివసేన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండేను చేరితే పార్టీని చీల్చి.. వారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని అనర్హత వేటును తప్పించుకోవచ్చు.

eknath shinde need 7 more shivsena mlas to bypass anti defection law disqualification move
Author
Mumbai, First Published Jun 22, 2022, 5:46 PM IST

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వం సంక్షోభం అంచులకు వెళ్లింది. రెబల్ శిబిరం మరో అడుగు ముందుకు వేసి గవర్నర్‌కు లేఖ రాశారు. ఏక్‌నాథ్ షిండేనే తమ నేత అంటూ 34 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిన లేఖ మహారాష్ట్ర గవర్నర్‌కు పంపారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయింపు చట్టం.. పార్టీలో చీలిక వంటి అంశాలపై చర్చ మొదలైంది.

సంతకాలు పెట్టిన 34 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఒక వేళ బీజేపీ పార్టీలోకి చేరితే.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారంతా రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ ఫిరాయింపుల చట్టంలోని అనర్హత వేటును అధిగమించడానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రెబల్ అయితే సరిపోతుంది. అంటే.. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు మరో ఏడుగురు శివసేన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ షిండే వద్దకు వెళ్లితే.. అప్పుడు వారు శివసేన పార్టీని చీల్చడానికి ఆస్కారం ఉంటుంది. అంటే.. వారు రాజీనామా చేయకుండానే వేరే పార్టీకి మద్దతు తెలుపవచ్చు. ఇదే జరిగితే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, నడపడం బీజేపీకి నల్లేరు మీద నడకగా మారుతుంది.

ఇదిలా ఉండగాా, మహారాష్ట్రలో శివసేన పార్టీలో చీలక వస్తుందా? అనే స్థాయికి పరిణామాలు వెళ్లినా.. బీజేపీ మాత్రం హడావుడి చేయడం లేదు. తన వెంట 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తిరుగుబావుటా ఎగరేసిన ఏక్‌నాథ్ షిండే ప్రకటించినప్పటికీ బీజేపీ మాత్రం ఆచితూచి అనే దారిని ఎంచుకున్నది. గతంలో కొంత వ్యతిరేకత వచ్చినా.. తిరుగుబాటు వ్యాఖ్యలు వచ్చినా.. బీజేపీ రచ్చ చేసేది. కానీ, ఇప్పుడు ఏకంగా ఏక్‌నాథ్ షిండే వెంట శివసేన ఎమ్మెల్యేలు రాష్ట్రాలు దాటుతున్నప్పటికీ మహారాష్ట్రలో బీజేపీ స్ట్రాటజీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

2019లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ మళ్లీ అలాంటి తప్పిదం పునరావృతం కావొద్దని భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హడావుడిగా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, మూడు రోజుల తర్వాత మెజార్టీ బలం లేనందున రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకే ఈ సారి కచ్చితంగా నెంబర్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. నెంబర్స్ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభించాలని యోచిస్తున్నది. కేవలం మెజార్టీ సంఖ్యను దాటే బలం కాదు.. ఒక వేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా సునాయసంగా నడిపేలా ఉండాలని ఆలోచిస్తున్నది. అందుకే ఈ సారి శివసేనలో ఈ స్థాయిలో గందరగోళం నెలకొన్నప్పటికీ బీజేపీ తొందరపడటం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios