Asianet News TeluguAsianet News Telugu

మా కుటుంబాలకు ఏదైనా జరిగితే మీ అందరిదే బాధ్యత: సీఎం ఉద్దవ్‌కు లేఖ రాసిన ఏక్‌నాథ్ షిండే..

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించిందని ఆ క్యాంపుకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 

eknath Shinde letter to uddhav alleges Malicious withdrawal of security of family members of the 38 MLAs
Author
First Published Jun 25, 2022, 12:02 PM IST

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించిందని ఆ క్యాంపుకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తమకు, తమ కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అయితే ఏక్‌నాథ్ షిండ్ చేసిన వ్యాఖ్యలను శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఖండించారు. మరోవైపు 38 మంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల భద్రతను దురుద్దేశపూర్వకంగా ఉపసంహరించుకున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్‌, డీజీపీల Rajnish Sethలతో పాటు, రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లకు ఏక్‌నాథ్ షిండే లేఖ రాశారు. 

“మేము ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేం. మా నివాసంతో పాటు మా కుటుంబ సభ్యులకు ప్రోటోకాల్ ప్రకారం అందించాల్సిన భద్రతను ప్రతీకార చర్యగా చట్టవిరుద్ధంగా ఉపసంహరించబడింది. ఎన్సీపీ, ఐఎన్‌సీ గూండాలతో కూడిన ఎంవీఏ ప్రభుత్వం డిమాండ్‌లను అంగీకరించడానికి మాపై ఒత్తిడి తేవడానికి, మా సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ దుర్మార్గపు చర్య మరొక ప్రయత్నం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’’ అని ఏక్‌నాథ్ షిండే లేఖలో పేర్కొన్నారు.

MVA కూటమిలోని భాగస్వామ్య పార్టీలు.. తమ శాసనసభ్యులపై హింసాత్మక చర్యలకు పాల్పడేలా వారి కార్యకర్తలను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. శాసనసభ్యుల కుటుంబ సభ్యులకు ఏదైనా హాని జరిగితే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే, సేన ఎంపీ సంజయ్ రౌత్ సహా మహా వికాస్ అఘాడీ అగ్రనేతలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. వెంటనే తమ కుటుంబాలకు భద్రతను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

 

ఇదిలా ఉంటే ఈ రోజు మధ్యాహ్నం సీఎం ఉద్దవ్ ఠాక్రే శివసేన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ప్రస్తుత పరిణామాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, శుక్రవారం ఉద్దవ్ ఠాక్రే పార్టీకి చెందిన జిల్లా ముఖ్యనేతలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు అని ఉద్దవ్ చెప్పారు. శివసేన అంతం కాలేదని.. బీజేపీ పక్షాన ఉన్న వ్యక్తులను తప్పనిసరిగా ప్రశ్నించాలని థాకరే పిలుపునిచ్చారు. ‘‘వెళ్లాలనుకునే వారు బహిరంగంగా వెళ్లేందుకు స్వేచ్ఛ ఉంది.... నేను కొత్త శివసేనను సృష్టిస్తాను’’ అని చెప్పారు.  

శివసేన పార్టీ కార్పొరేటర్లను ఉద్దేశించి వర్చువల్ ప్రసంగంలో ఠాక్రే మాట్లాడుతూ.. తమ పార్టీని అంతం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘శివసేన ఒక సిద్ధాంతం.. హిందూ ఓటు బ్యాంకును ఎవరితోనూ పంచుకోవడం ఇష్టం లేదు కాబట్టే బీజేపీ శివసేనను ముగించాలనుకుంటోంది’’ అని అన్నారు. దివంగత బాల్ ఠాక్రే హిందూత్వ ఓట్లు చీలిపోకూడదనే బీజేపీతో పొత్తుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. 

ఇక, తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే క్యాంపులో చేరిన 16 మంది ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఈరోజు నోటీసులు అందజేసే అవకాశం ఉంది. ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు శివసేన లేఖ పంపిన సంగతి తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios