బ్రిటన్‌‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పలు దేశాలు తమ భూభాగంలోకి స్ట్రెయిన్ 70 రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

అటు భారత ప్రభుత్వం కూడా యూకే నుంచి, యూకే మీదుగా వచ్చే విమానాలను నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అంతకుముందే యూకే నుంచి వచ్చిన వారు వివిధ రాష్ట్రాలకు వెళ్లిపోయి వుంటారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఇప్పటికే యూకే నుంచి వచ్చిన పలువురికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో వారిని ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా యూకే నుంచి వచ్చిన 14 మంది కర్ణాటకవాసులకు, కేరళకు వచ్చిన 8 మందికి కరోనా తేలింది. అంతకుముందు భువనేశ్వర్‌లో బ్రిటన్‌ నుంచి తిరిగొచ్చిన నాలుగేళ్ల చిన్నారికి కూడా వైరస్‌ సోకినట్లు గుర్తించారు. 

బ్రిటన్‌ నుంచి మొత్తం 2,500 మంది రాష్ట్రానికి తిరిగొచ్చినట్లు గుర్తించామని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్‌ తెలిపారు. వీరిలో ఇప్పటికే 1,638 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14 మందికి పాజిటివ్‌గా తేలిందన్నారు.

అయితే వీరికి సోకింది మార్పు చెందిన వైరసా? కాదా? అన్నది తేల్చేందుకు గాను శాంపిల్స్‌ను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపామని సుధాకర్ వెల్లడించారు. వీటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. 

మరోవైపు యూకే నుంచి కేరళకు వచ్చిన 8 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.కె.శైలజ వెల్లడించారు. వీరి శాంపిళ్లను కూడా పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీకి పంపారు.

ప్రస్తుతం వీరిని క్వారంటైన్‌లో వైద్యుల పర్యవేక్షణలో వుంచినట్లు చెప్పారు. కేరళలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో కోవిడ్ ఉగ్రరూపం చూపే అవకాశం వుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,.