Asianet News TeluguAsianet News Telugu

వ్య‌క్తిగ‌తం కాదు దేశ ప్ర‌యోజ‌నాల కోసమే.. ప్ర‌తిప‌క్షాలను ఏకంచేసే ప్రయత్నాలపై నితీష్ కుమార్ వ్యాఖ్యలు

ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు దేశానికి ప్రయోజనం కల్పిస్తాయని బీహార్ ముఖ్య‌మంత్రి, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ అన్నారు. 2024 లోక్ స‌భ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలు ఏకం కావాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న నొక్కి చెప్పారు. 
 

Efforts to bring opposition together will benefit the country: Bihar CM Nitish Kumar
Author
First Published Sep 8, 2022, 12:01 PM IST

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంతో ఉన్న బీజేపీకి వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తిన బీహార్ ముఖ్య‌మంత్రి, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రస్తుత ఏకపక్ష (బీజేపీ) పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని అన్నారు. నితీశ్‌ కుమార్‌ బుధవారం ఢిల్లీలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌తో సమావేశమయ్యారు. ఇరువురు నేతల మధ్య దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. సమావేశానంతరం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. మనం కలిసి ఎన్నికల్లో పోరాడితే దేశాభివృద్ధికి మేలు జరుగుతుందన్నారు. మనం ఐక్యంగా ఉండడం చాలా ముఖ్యం. మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు.. అందరూ ఐక్యంగా ఉంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుందనేది ఒక్కటే లక్ష్యం. అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత చాలా మంచి స్పందన వచ్చిందన్నారు. కొంద‌రు దేశాన్నినాశ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నీ, ఈ వ్యక్తులు (బీజేపీ) సంబంధిత ప్రచారంలో నిమగ్నమై ఉన్నార‌ని అన్నారు.

“నేను నా కోసం ఎలాంటి పాత్ర కోసం వెతకడం లేదు. నాకు, పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడం చాలా ముఖ్యం. ప్రతిపక్షాలు పొత్తు పెట్టుకుంటే ఏర్పడే పరిస్థితి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తుంది. అయితే ఇది జాతీయ ప్రయోజనాలకు సంబంధించినదని నేను మీకు చెప్పగలను” అని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అనంతరం నితీష్ విలేకరులతో అన్నారు.

బుధవారం నాడు శరద్ పవార్‌ను కలవడానికి ముందు, నితీష్ కుమార్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయాల‌పై చ‌ర్చించారు. కాగా, గత నెలలో బీహార్‌లో నితీష్‌ కుమార్‌ బీజేపీతో పొత్తు తెంచుకుని ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతిపక్షాలు ఐక్యతపై నిరంతరం పట్టుబడుతున్నాయి. తాను ప్రధానమంత్రి అభ్యర్థిని కానని, ఆశించడం లేదని, అయితే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే తన లక్ష్యమని నితీష్ కుమార్ మంగళవారం అన్నారు. ఇటీవల శరద్ పవార్ కూడా తాను ప్రధాని అభ్యర్థిని కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు నిరంతరం చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈమేరకు మంగళవారం గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో ఎస్పీ కన్వీనర్ ములాయం సింగ్ యాదవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్‌తో భేటీకి ముందు హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాను కూడా కలిశారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా బీహార్ సీఎం కలిశారు. ఆ తర్వాత మంగళవారం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. కేజ్రీవాల్ కంటే ముందు, కుమార్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ-ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి. రాజాలను కూడా వారి పార్టీ కార్యాలయాల్లో కలిశారు.

Follow Us:
Download App:
  • android
  • ios