మహా వికాస్‌ అగాడీకి చెందిన నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చర్యలను శరద్‌ పవార్‌ తప్పుబట్టారు. కేంద్ర సంస్థలను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోందని కేంద్రం తీరుపై ఆయన మండిపడ్డారు.  

కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని లొంగదీసుకునే ప్రయత్నాల్లో భాగంగానే మహా వికాస్‌ అగాడీకి చెందిన నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చర్యలు చేపడుతోందని శరద్‌ పవార్‌ ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాలరాయడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ప్రయత్నమేనని ఆయన విమర్శించారు. 

కాగా, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌, ఎన్‌సీపీ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సేతో పాటు శివసేన ఎంపీ భవానీగవాలీతోపాటు ఇతర నేతలపై మనీలాండరింగ్ కేసులలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఇలా వరుసగా అధికార కూటమికి చెందిన నేతలపై ఈడీ చర్యలను గతంలో ఎన్నడూ చూడలేదని ఎన్‌సీపీ చీఫ్‌ తప్పుబట్టారు. కేంద్ర సంస్థలను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోందని కేంద్రం తీరుపై ఆయన మండిపడ్డారు. ఇక థర్డ్‌ వేవ్‌ గురించి స్పందించిన పవార్‌, కొవిడ్‌ నిబంధనలను పాటించకుండానే భారీ సమూహాలుగా సమావేశాలు, వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే రాష్ట్రంలో ఎలాంటి సమావేశాలు జరపవద్దంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాజకీయ పార్టీలకు సూచించిన విషయాన్ని పవార్ గుర్తుచేశారు.