అన్నాడీఎంకేలో గతకొంతకాలం అంతర్గత పోరు కొనసాగుతున్న సంగతి తెలిసింది. అయితే ఈ పోరులో పన్నీరు సెల్వం వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే పగ్గాలను పళనిస్వామి దక్కించుకున్నారు. 

అన్నాడీఎంకే పగ్గాలను పళనిస్వామి దక్కించుకున్నారు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించుకునేందుకు మద్రాస్ హైకోర్టు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరించాలని, కోఆర్డినేటర్‌తో పాటు జాయింట్ కోఆర్డినేటర్ పోస్టులను రద్దు చేసేందుకు ఈపీఎస్ వర్గం పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమావేశాన్ని నిలిపివేయాలని ఓ పన్నీర్‌సెల్వం వర్గం విజ్ఞప్తి చేసింది. దీనిని మద్రాస్ హైకోర్టు నేడు తిరస్కరించింది. 

చట్టానికి లోబడి సభను నిర్వహించవచ్చని కోర్టు తెలిపింది. దీంతో పన్నీర్ సెల్వం వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు తీర్పుతో ప్రిసీడియం చైర్మన్ తమిళ మహాన్ హుస్సేన్ అధ్యక్షత అన్నాడీఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పళనిస్వామితో పాటు పలువురు నాయకులు ఎంజీఆర్, జయలలిత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమాశంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని నియమించారు.

ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించిన 16 తీర్మానాలకు జనరల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని నియమించడం కూడా ఇందులో ఉంది. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామికి దక్కాయి. ఇక, నాలుగు నెలల్లో ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక నిర్వహించాలని జనరల్ కౌన్సిల్ కూడా తీర్మానం చేసింది. పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని తొలగించి, పార్టీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని సృష్టించాలని జనరల్ కౌన్సిల్ తీర్మానం చేసింది.

అంతకుముందు ఈరోజు ఉదయం చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యాలయం వద్ద పన్నీరు సెల్వం, పళనిస్వామి వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సమీపంలోని పార్క్ చేసిన పలు వాహనాలను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే అన్నాడీఎంకే శ్రేణులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు.