అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి నిర్వహించిన ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు మద్రాసు హైకోర్టు మంగళవారం నిరాకరించింది.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి నిర్వహించిన ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు మద్రాసు హైకోర్టు మంగళవారం నిరాకరించింది. 2022 జులై 11న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్‌ తీర్మానాలను, ప్రధాన కార్యదర్శి ఎన్నికల నిర్వహణను సవాలు చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, అతని మద్దతుదారులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో పన్నీర్ సెల్వం(ఓపీఎస్‌) వర్గానికి మరోసారి నిరాశే మిగిలింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టేసిన కొన్ని నిమిషాల్లోనే.. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. 

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఇడప్పాడి కె పళనిస్వామి (ఇపిఎస్) ఎన్నికైనట్టుగా ఆ పార్టీ ఎన్నికల అధికారులు పొల్లాచ్చి వి జయరామన్, మాజీ మంత్రి నాథమ్ ఆర్ విశ్వనాథన్‌లు రోయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రకటన చేశారు. దీంతో అన్నాడీఎంకే కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా పళనిస్వామి.. తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక, 2022 జూలై 11న అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ (పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ) సమావేశం..పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పన్నీర్‌సెల్వం, ఆయన సహాయకులను బహిష్కరించిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎన్నికను నిలిపివేసేందుకు నిరాకరించిన సింగిల్ జడ్జి ఉత్తర్వులపై తమ అప్పీళ్లను అత్యవసరంగా విచారించాలని కోరుతూ జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ముందు ఓపీఎస్ వర్గం తరఫు న్యాయవాదులు అత్యవసరంగా ప్రస్తావించారు. ఈ అప్పీల్‌ను బుధవారం విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది.