నేతను అరెస్టు చేసేందుకు వెళ్తే.. ఈడీ బృందంపైనే దాడి.. 200 మంది చుట్టుముట్టి.. సినిమా స్టైల్ లో ఫైట్..

ration distribution scam : రేషన్ కుంభకోణం కేసులో ఓ రాజకీయ నాయకుడిని అరెస్టు చేసేందుకు ఈడీ అధికారులు వెళ్లారు. ఈ విషయం తెలిసి ఆ గ్రామస్తులంతా అధికారులను చుట్టుముట్టారు. సుమారు 200 మంది గుంపు వారిపై దాడి చేశారు. 

ED team attacked when going to arrest TMC leader in ration scam.. 200 people surrounded and attacked.. Incident in West Bengal..ISR

ఏదైనా కేసుల్లో పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్తే.. అక్కడి స్థానికులు వారిని అడ్డుకోవడం, వారిపై దాడి చేయడం వంటి ఘటనలు మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ పశ్చిమ బెంగాల్ లో ఇలాంటి ఘటన నిజంగానే జరిగింది. ఆ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన రేషన్ కుంభకోణంలో నిందితుడిగా ఓ టీఎంసీ నేత ఇంటికి వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందంపై స్థానికులు దాడి చేశారు. సుమారు 200 మంది గ్రామస్తులు వారిని చుట్టుముట్టి వాహనాలను ధ్వంసం చేశారు.

రేషన్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం పశ్చిమ బెంగాల్‌లో నిరంతరం దాడులు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఈడీ బృందం నార్త్ 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ గ్రామంలో ఉన్న టీఎంసీ నేత ఎస్ కే షాజహాన్ షేక్ ఇంటికి దర్యాప్తు చేసేందుకు వెళ్లింది. ఈ విషయం తెలియడంతో ఆ గ్రామానికి చెందిన దాదాపు 200 మంది వారిని చుట్టుముట్టారు. ఒక్క సారిగా ఈ గుంపు అంతా ఈడీ బృందంపై దాడి చేసింది. 

వారంతా ఈడీ అధికారులు, వారితో వచ్చిన కేంద్ర భద్రతా దళాల వాహనాలను ధ్వంసం చేశారు. అయితే ఈ దాడి అనంతరం పోలీసులు ఈ రేషన్ పంపిణీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న టీఎంసీ నాయకుడు ఎస్ కే షాజహాన్‌ను అరెస్టు చేశారు. ఈ దాడిలో గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. క్షతగాత్రులు ఇప్పుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

కాగా.. పశ్చిమ బెంగాల్ లో రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి కొన్ని నెలలుగా ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రంలో లబ్ధిదారుల కోసం ఉద్దేశించిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) రేషన్‌లో 30 శాతం బహిరంగ మార్కెట్‌కు పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో వెల్లడించింది. రేషన్ ను పక్కదారి పట్టించిన తరువాత వచ్చిన డబ్బును మిల్లు యజమానులు, పీడీఎస్ పంపిణీదారులు పంచుకున్నారని దర్యాప్తు సంస్థ తెలిపింది.

రైస్‌మిల్లు యజమానులు కొందరు సహకార సంఘాలతో పాటు కొంత మంది వ్యక్తుల సహకారంతో రైతులకు నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. రైతులకు చెల్లించే ఎంఎస్‌పీని కూడా జేబులో వేసుకున్నారు. దీని వల్ల రైస్‌మిల్లు యజమానులు క్వింటాల్‌కు దాదాపు రూ.200 సంపాదించారు. కాగా.. గతంలో రేషన్ కుంభకోణం కేసులో బెంగాల్ మంత్రి జ్యోతిప్రియా మాలిక్ నివాసంపై కూడా ఈడీ దాడులు చేసింది. అటవీ శాఖ మంత్రి కాకముందు జ్యోతిప్రియ మాలిక్ ఆహార మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైస్ మిల్లు యజమాని బాకీబుర్ రెహమాన్‌ను ఈ కుంభకోణంలో అరెస్టు చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios