Land For Job Case : ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె చందా యాదవ్‌ను ఈడీ గురువారం ప్రశ్నించింది. ఈ కేసులో చందా యాదవ్‌ను ఈడీ విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ కేసులో అంతకుముందు.. లాలూ యాదవ్ కుమార్తెలు మిసా భారతి, రాగిణి యాదవ్, కుమారుడు తేజస్వి యాదవ్‌లను కూడా ఈడీ విచారించింది.

Land For Job Case : ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ మనీలాండరింగ్ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె చందా యాదవ్ వాంగ్మూలాన్ని గురువారం నమోదు చేశారు. ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. అంతకుముందు.. ఈ కేసులో ఆయన కుమార్తె రాగిణి యాదవ్‌, మిసా భారతిని ఈడీ బుధవారం ప్రశ్నించింది. సెంట్రల్ ఢిల్లీలోని ఏజెన్సీ కార్యాలయంలో లాలూ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను కూడా విచారించారు. ఈ సమయంలో వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది. ఈ క్రమంలో చాలా చోట్ల ఈడీ దాడులు జరిగాయి. పాట్నా, ఫుల్వారీ షరీఫ్, ఢిల్లీ NCR, రాంచీ , ముంబైలోని చందా యాదవ్, ఆమె సోదరి రాగిణి యాదవ్, హేమా యాదవ్ , RJD మాజీ ఎమ్మెల్యే అబు దుజానా ప్రాంగణాలపై ED దాడులు చేసింది.

లాలూ యాదవ్‌పై ఆరోపణలు 

ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఈడీ, సీబీఐ నిరంతరం చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిలను కూడా సీబీఐ ప్రశ్నించింది. ఆర్జేడీ అధినేత బంధువుల నివాసాలపై ఈడీ నిరంతరం దాడులు చేస్తోంది. ఈ సందర్భంగా ఈడీ కోటి రూపాయల నగదు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఆర్జేడీ కుటుంబం, వారి సహచరులు రియల్ ఎస్టేట్ సహా అనేక రంగాలలో పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది.ఇంకా విచారణ కొనసాగుతోందని ఈడీ తెలిపింది.

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ అంటే ఏమిటి?

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ 2004 నుండి 2009 మధ్యకాలంలో జరిగింది. ఆ సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ UPA-1 ప్రభుత్వంలో కేంద్ర రైల్వే మంత్రిగా పని చేశారు. గ్రూప్ డి కింద చాలా మందికి అక్రమంగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఉద్యోగానికి బదులు లాలూ యాదవ్ కుటుంబ సభ్యుల పేరిట భూమిని బదలాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగానికి బదులుగా లాలూ యాదవ్ కుటుంబ సభ్యులకు మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు భూమిని విక్రయించారని సీబీఐ చెబుతోంది.

ఈ ఉద్యోగాల కోసం ఎలాంటి పబ్లిక్ నోటీసులు జారీ చేయలేదని, పాట్నా వాసులకు ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్, హాజీపూర్‌లోని వివిధ రైల్వే జోన్‌లలో అపాయింట్‌మెంట్లు ఇచ్చారని సీబీఐ చెబుతోంది. అయితే.. ఈ ఆరోపణలను లాలూ యాదవ్ , అతని కుటుంబ సభ్యులు పూర్తిగా తోసిపుచ్చుతోంది. రైల్వే మంత్రిగా ఉంటూ ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చే శక్తి తన తండ్రికి లేదని తేజస్వీ యాదవ్ అంటున్నాడు.