Asianet News TeluguAsianet News Telugu

సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు..

శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసు‌కున్నారు. పత్రా చల్ కుంభకోణం కేసులో అధికారులు సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు ఆదివారం ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

ED detain Shiv Sena MP Sanjay Raut after raid at his residence in mumbai
Author
First Published Jul 31, 2022, 4:21 PM IST

శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసు‌కున్నారు. పత్రా చల్ కుంభకోణం కేసులో అధికారులు సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు ఆదివారం ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో సంజయ్ రౌత్ తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ కేసుకు సంబంధించి ముంబైలోని సంజయ్ రౌత్ నివాసంలో ఈరోజు ఉదయం ఈడీ సోదాలు నిర్వహించింది. ఉదయం 7 గంటలకు సంజయ్ రౌత్ నివాసానికి చేరుకున్న ఈడీ బృందం.. సోదాలు నిర్వహించడంతో పాటు, ఆయనను ప్రశ్నించింది. గంటల తరబడి విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుంది. 

అయితే తన నివాసంలో ఈడీ సోదాలపై సంజయ్ రౌత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘మహారాష్ట్ర, శివసేన పోరాటం కొనసాగిస్తూనే ఉంటాయి.. ’’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ‘‘తప్పుడు చర్య.. తప్పుడు సాక్ష్యం.. నేను శివసేనను వీడను.. నేను చనిపోయినా లొంగిపోను.. జై మహారాష్ట్ర. నాకు ఎలాంటి స్కామ్‌తో సంబంధం లేదు. బాలాసాహెబ్ మనకు పోరాడడం నేర్పించారు.. నేను శివసేన కోసం పోరాడుతూనే ఉంటాను’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. 

అయితే పాత్రా చాల్‌ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబై 'చాల్' రీ-డెవలప్‌మెంట్‌లో అవకతవకలు, సంజయ్ రౌత్ భార్య, అతని సహచరులకు సంబంధిత లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రౌత్‌ను ఈడీ విచారణకు పిలిచింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ నెలలో సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్, మరో ఇద్దరికి చెందిన రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 

జూలై 1న రాజ్యసభ ఎంపీని సుమారు 10 గంటల పాటు ప్రశ్నించగా.. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు సంజయ్ రౌత్ రెండు సార్లు ఈడీ సమన్లను దాటవేశారు. ఇందులో తాజాగా జూలై 27న జారీ చేసిన సమన్లు కూడా ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు హాజరుకాలేదని సంజయ్ రౌత్ చెబుతున్నారు.  

అయితే శివసేనకు వ్యతిరేకంగా ఈడీని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఈడీ చేత ఎంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా తాము ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి నడుస్తానని చెబుతున్నారు. మరోవైపు సంజయ్ రౌత్ ఈడీ విచారణకు హాజరుకాకపోవడంపై బీజేపీ నేతు ఎదురుదాడి చేస్తున్నారు. ‘‘అతడు ఏ తప్పు చేయకపోతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఎందుకు భయపడుతున్నాడు? అతనికి విలేకరుల సమావేశాలు నిర్వహించడానికి సమయం ఉంది.. కానీ విచారణ కోసం ఈడీ కార్యాలయానికి వెళ్లడానికి సమయం లేదు’’ అని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios