ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌‌ చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆయన యూపీ సీఎంగా ఉన్న కాలంలో చేపట్టిన గోమతి నది సుందరీకరణ పనుల పథకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.

గోమతి నది సుందరీకరణ పనుల్లో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీబీఐ దీనిపై దర్యాప్తు చేస్తుండగా, గతేడాది మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అలోక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని విచారణ కమిటీ కూడా గోమతి నది అభివృద్ధి ప్రాజెక్ట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆధారాలను చూపింది. ఈ కమిటీ 2017 మే 16న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.

మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నాలుగు చోట్ల సోదాలు నిర్వహించింది. లక్నో, నోయిడా, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్థానిక పోలీసుల భద్రతతో సోదాలను నిర్వహిస్తోంది.