దివంగత తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనుమడు, ఎంకే అళగిరి కుమారుడు అళగిరి దయానిధికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. అక్రమ గ్రానైట్ మైనింగ్ కేసులో ఆయనకి చెందిన రూ. 40 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది.

ఎంకే అళగిరి గతంలో కేంద్ర రసాయనాలు, పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో తండ్రి అధికారంతో అళగిరి దయానిధి అక్రమాలకు పాల్పడినట్లుగా ఆయనపై మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ మధురై కేంద్రంగా నడుస్తున్న ఒలింపిక్స్ గ్రానైట్స్ కంపెనీ లావాదేవీలపై ఆరా తీసింది.

ఈ కంపెనీలో ప్రధాన షేర్ హోల్డర్లు, ప్రమోటర్లు, డైరెక్టర్లుగా ఉన్న ఎస్. నాగరాజన్, అళగిరి దయానిధితో పాటు మరికొందరు కుట్ర పూరితంగా అక్రమ మైనింగ్ లావాదేవీలు నిర్వహించి ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం కలిగించినట్లు ఈడీ గుర్తించింది.

దీనితో పాటు అక్రమ క్వారియింగ్ ద్వారా పలువురి నుంచి లబ్ధి పొందినట్లుగా ఛార్జిషీటులో పేర్కొంది. దీని ద్వారా పొందిన ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్‌లో తప్పుగా చూపినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది.

ఈ నేపథ్యంలో అక్రమ మార్గాల్లో సంపాదించిన అళగిరి దయానిధికి చెన్నై, మధురైలలో ఉన్న స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసింది. వీటి విలువ రూ. 40.34 కోట్లు ఉంటుందని అంచనా.. మరిన్ని వివరాలు అందాల్సి వుంది.