ముంబై: వ్యాపారవేత్త, తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎంపీ కేడీ సింగ్ కు ఈడీ షాకిచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కన్వర్ దీప్ సింగ్ ను బుధవారం నాడు అరెస్ట్ చేసింది.

పీఎంఎల్ఏ చట్టం కింద ఆయనను అదుపులోకి తీసుకొన్నట్టుగా ఈడీ ప్రకటించింది. రూ.1900 కోట్ల రూపాయాల పోంజీ చిట్ ఫండ్ స్కాం కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను అరెస్ట్ చేసింది ఈడీ.ఆల్ కెమిస్ట్ ఇన్‌ఫ్రా రియాల్టీ లిమిటెడ్ తో సంబంధం ఉన్నట్టుగా కేడీ సింగ్ పై  2016లో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ విషయమై ఆయన ఇల్లు, కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహించింది.

2019 జనవరిలో ఆల్ కెమిస్ట్ ఇన్‌ఫ్రా రియాల్టీ  సంస్థకు చెందిన రూ. 239 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో కూడ కేడీసింగ్ ను సీబీఐ ప్రశ్నించింది.బెంగాల్ రాష్ట్రంలో నాలుగైదు మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీఎంసీ నుండి అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.