New Delhi: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో తనను సీబీఐ అరెస్టు చేయడంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియా పాత్ర ఉందన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదివారం ఆయనను అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు కేంద్రంలోని మోడీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
Delhi Liquor Policy Scam: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కోసం ఉపయోగించుకుంటున్నాని కాంగ్రెస్ ఆరోపించింది. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో తనను సీబీఐ అరెస్టు చేయడంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీశ్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియా పాత్ర ఉందన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆదివారం ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి పంపిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షసాధింపు కోసం వాడుకుంటున్నారని ట్విటర్లో ఆరోపించారు.
ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ వంటి సంస్థలు మోడీ సర్కార్ పాలనలో రాజకీయ కక్షసాధింపు, వేధింపులకు సాధనాలుగా మారాయని కాంగ్రెస్ ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తోంది. ఈ సంస్థలు అన్ని ప్రొఫెషనలిజాన్ని కోల్పోయాయని విమర్శించింది. ప్రతిపక్ష నేతల ప్రతిష్ఠను దెబ్బతీసే క్రమంలో ఆప్ నేతలను టార్గెట్ చేస్తున్నారని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.
కాగా, సుదీర్ఘ విచారణ తర్వాత, రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలకు సంబంధించి సీబీఐ ఆదివారం సాయంత్రం ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. విచారణ సమయంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సహకరించడం లేదని ఓ అధికారి ఆరోపించారు. సీబీఐకి సమాధానం చెప్పకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్టు తెలిపారు. సిసోడియా అరెస్టుతో ఆప్ కార్యకర్తలు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో బీజేపీ, ఆప్ కార్యాలయాలున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఎమ్మెల్యే సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈడీ, సీబీఐలకు అప్పగిస్తే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బులియన్ బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీలను రెండు గంటల్లో అరెస్టు చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "నాకు ఈడీ, సీబీఐ ఇవ్వండి, రెండు గంటల్లో మోడీ, అమిత్ షా, అదానీలను అరెస్టు చేస్తా. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసే అధికారం ఉన్నప్పుడు మీరు ఏదైనా చేయవచ్చు' అని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. కాగా, తాజా పరిణామాల్లో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం 3.50 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
