భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 చివరి ఘట్టంలో ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ తెగిపోయిన సంగతి తెలిసిందే. ప్రయోగం సక్సెస్ అయ్యిందీ.. కానిదీ ఏమీ తెలియకుండా పోయింది. ఎంతో కష్టపడి చేసిన ప్రయోగం ఇలా అవ్వడంతో శాస్త్రవేత్తలు అంతా నిరాశకు గురయ్యారు. ఇస్రో ఛైర్మన్ అయితే ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు. కాగా... నాది కూడా ఇదే కథ అంటోంది ఇజ్రాయిల్ దేశం.

భారత్ నుంచి చంద్రయాన్ 2 ప్రయోగానికి కొద్దిరోజుల ముందే ఈ ఏడాది ఏప్రిల్ లో ఇజ్రాయిల్ దేశం కూడా తమ స్పేస్ క్రాఫ్ట్ బెరెషీట్ ను చంద్రునిపైకి పంపిచింది. అయితే... ఇజ్రాయిల్ చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కాలేదు. స్పేస్‌క్రాఫ్ట్ చంద్రునిపైకి ల్యాండ్ అవుతున్న సమయంలో క్రాష్ అయిపోయింది. ఇది ఇజ్రాయెల్‌కు చెందిన తొలి ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్. 

ఇజ్రాయెల్లోని ఒక స్వచ్ఛందసంస్థ దీనిని లాంచ్ చేసింది. అమెరికాకు చెందిన ఆర్క్ మిషన్ ఫౌండేషన్ అనే కంపెనీ ఈ ప్రయోగంలో ఇజ్రాయెల్‌కు సాయం అందించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ నిర్వహించిన ప్రయోగంలో స్పేస్‌క్రాఫ్ట్‌ ఇంజనులో సాంకేతిక లోపం తలెత్తి, బ్రేకింగ్ సిస్టం ఫెయిల్ అయ్యింది. అప్పటికి అది చంద్రునికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అయితే... ప్రస్తుతం మన స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ అవ్వలేదు. కానీ... ఏమయ్యింది అన్నది మాత్రం తెలియలేదు. మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా... చివరి ఘట్టంలో సిగ్నల్స్ తెగిపోయాయి.