కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాక రేపుతున్న సందర్భంలో ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను ఉపేక్షించమని పేర్కొంది. ఈ ప్రలోభాలను అడ్డుకోవడానికి ఫోన్ పే, ఓలా మనీ, ఉబర్ పే వంటి యూపీఐ యాప్‌లపై నజర్ వేశామని, సోషల్ మీడియాపైనా నిఘా పెట్టినట్టు వివరించింది. బ్యాంకు లావాదేవీలనూ ట్రాక్ చేస్తామని తెలిపింది.
న్యూఢిల్లీ: ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ పార్టీలు ఓటర్లకు గాలం వేసే పనిలో శాయశక్తులో తలమునకలవుతాయి. ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని అడ్డుకోవడానికీ అదే విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ రాజకీయ నేతలు ప్రలోభపెట్టడానికి కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. నేరుగా నగదును చేతిలో పెట్టడం కాకుండా గిఫ్ట్ వోచర్లు, ఆన్‌లైన్ పేమెంట్లు గుట్టుచప్పుడు కాకుండా చేసేసుకుంటున్నారు. ప్రత్యర్థులకు, ఎన్నికల సంఘానికి, పోలీసులకూ దొరకకుండా గాలం వేస్తున్నారు. అయితే, ఈ కొత్త మార్గాల్లో జరిగే ప్రలోభాలనూ ఈసీఐ అదే టెక్నాలజీ సహాయంతో అడ్డుకుంటూ ఉన్నది. మానిటర్ చేస్తున్నది. తాజాగా, ఈ విషయాన్ని మరోసారి వెల్లడించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న సందర్భంలో ఈసీఐ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.
డబ్బులు ఇచ్చి ఓట్లు పొందాలనే కుయుక్తులను అడ్డుకుంటామని ఈసీఐ స్పష్టం చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఫోన్‌పే, ఓలా మనీ, ఉబర్ పే వంటి యూపీఐలపై నజర్ వేసినట్టు వివరించింది. సోషల్ మీడియా యాప్స్ పైనా దృష్టి పెట్టినట్టు తెలిపింది. ఎన్నికలు పారదర్శకంగా, నిజాయితీగా నిర్వహించడానికి ఈ పని చేస్తున్నట్టు వివరించింది.
Also Read: బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు.. రేపు ఉదయం జైలు నుంచి బయటకు!
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి కఠినమైన ప్రొటోకాల్‌ను అమల్లోకి తెచ్చామని ఈసీ అధికారి సూర్య సేన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సోషల్ మీడియా చాలా కీలకంగా మారుతుందని వివరించారు. అసెంబ్లీ ఎన్నికలైనా.. 2024 లోక్‌సభ ఎన్నికలైనా ఇవి కీలకంగా ఉంటాయని చెప్పారు. అన్ని పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్, ఫ్యాన్ పేజీలు, పొలిటీషియన్‌ల పేజీలను సంపూర్ణంగా స్క్రుటినైజ్ చేయడానికి ప్రత్యేక నిపుణుల బృందం పని చేస్తుందని అన్నారు.
డిజిటల్ ఎకానమీని పరీక్షిస్తామని, ఇందులో భాగంగానే యూపీఐ యాప్‌లను పర్యవేక్షిస్తామని వివరించారు. అలాగే, బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలనూ ట్రాక్ చేస్తామని అన్నారు.
