కర్ణాటక ఉప ఎన్నికలకు సంబంధించి సోమవారం కౌంటింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. యెల్లాపూర్, రాణెబెన్నూర్, విజయనగర, యశ్వంత్‌పూర్, మహాలక్ష్మీ లే ఔట్, చిక్కబళ్లాపూర్, కేఆర్ పురం, శివాజీ నగర్, కేఆర్ పేట్, హుణసూర్, అథానీ, కాగ్‌వాడ్, గోఖక్, హోస్కోటే, హిరేకేరూర్‌లలో డిసెంబర్ 5న పోలింగ్ జరిగింది.

న్యాయపరమైన సమస్యల కారణంగా రాజరాజేశ్వరి నగర్, మాస్కిలలో ఎన్నికలు జరగలేదు. గురువారం జరిగిన పోలింగ్‌లో 80 శాతం ఓటింగ్ నమోదవ్వడంతో అన్ని రాజకీయ పార్టీల్లో గుబులు మొదలైంది.

Also Readయడ్డీ సీఎంగా ఉంటారా.. ప్రతిపక్షనేతగా మారతారా: డిసెంబర్‌ 9పై అందరి దృష్టి

యడియూరప్ప ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఎన్నికల్లో ఫలితం కోసం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

అయితే రెండు నియోజకవర్గాల్లో న్యాయ సంబంధ కేసులు కోర్టులో ఉన్నందున 15 అసెంబ్లీ స్థానాల్లోనే ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ 15 స్థానాల్లో, జేడీఎస్ 12, బీఎస్‌పీ 2, ఎన్‌సీపీ ఒక్క స్థానం నుంచి పోటీ చేస్తోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా అనర్హులని ప్రకటించిన సుప్రీంకోర్టు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది.

సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన కాంగ్రెస్, జేడీఎస్‌లు ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశాయి. అనర్హత ఎమ్మెల్యేలంతా బీజేపీ నుంచి బరిలోకి దిగారు. అయితే ఫలితాల తర్వాత కాంగ్రెస్, జేడీఎస్‌లు మళ్లీ చేతులు కలిపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also read:బిజెపికి షాక్... వైసిపిలోకి గోకరాజు, ముహూర్తం ఖరారు

224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 105, కాంగ్రెస్ 66, జేడీఎస్ 34, బీఎస్పీ 1, ఒక స్వతంత్ర, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉండగా మరో ఎనిమిది మంది కావాలి.