Earthquake: ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 5.6 తీవ్రత నమోదు
Earthquake: నేపాల్‌లో సోమవారం 5.6 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. మూడు రోజుల క్రితం సంభవించిన భూకంపంలో నేపాల్ 150 మందికి పైగా మరణించగా, మరోసారి తాజా ప్రకంపనలు అక్కడి నివాసితులలో భయాందోళనలను సృష్టించాయి.
Earthquake in Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది, అయితే ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే, నేపాల్‌లో భూకంప కేంద్రం ఉండడంతో జిల్లాలోని ధార్చులా, దీదీహత్, బంగాపాని ప్రాంతాల్లో సాయంత్రం 4.17 గంటలకు భూకంపం సంభవించినట్లు ఇక్కడి విపత్తు నిర్వహణ కార్యాలయం తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొంది.
కాగా, 2015 తర్వాత అత్యంత ఘోరమైన 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం శుక్రవారం రాత్రి నేపాల్‌ను తాకడంతో ఇప్పటిరకు 157 మంది మరణించారు. 160 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. భూకంపం కారణంగా హిమాలయ దేశంలోని మారుమూల పర్వత ప్రాంతంలోని వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. నేపాల్‌లో 5.6 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. తాజాగా ఉత్తరాఖండ్ లోనూ భూకంపం సంభవించడం స్థానికంగా ఆందోళనను పెంచింది.
ఇదిలావుండగా, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో సోమవారం సాయంత్రం మళ్లీ బలమైన భూకంపం సంభవించింది. విపత్తు నిర్వహణ కార్యాలయం సమాచారం ప్రకారం, ఢిల్లీ-ఎన్సీఆర్ లో నాలుగు రోజుల్లో రెండవసారి భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రావడానికి నేపాల్ లో సంభవించిన భూకంపమే కారణమని పలువురు నిపుణులు పేర్కొన్నారు.