ఈశాన్య రాష్ట్రం సిక్కింలో మరోసారి భూమి కంపించింది. ఈ భూకంపం తాలూకు కంపనలు అస్సాం, ఉత్తర బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. సిక్కిం రాజధాని గ్యాంగ్ టాక్ కేంద్రంగా భూమి కంపించింది. సోమవారం రాత్రి భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా తమ ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4 గా నమోదయింది. 

సిక్కిం రాజధాని గ్యాంగ్ టాక్ నుండి 25 కిలోమీటర్ల  దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రాత్రి దాదాపుగా 8.49 ప్రాంతంలో ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతు కేంద్రంగా భూమి కంపించింది. సిక్కిం తో పాటుగా అస్సాం, ఉత్తర బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కూడా భూమి కంపించిందని ప్రాథమిక సమాచారం. నేపాల్, భూటాన్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్టు వార్తలు వస్తున్నాయి. 

ఒక్కసారిగా భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇండ్లలోంచి పరుగులు తీశారు. ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా నగరమంతా ఊగిపోతున్నట్టుగా అనిపించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం గురించి గని సమాచారం అందలేదు. 

ఈ విషయం తెలియగానే ప్రధాని నరేంద్రమోడీ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితులపై ఆరాతీసారు. ప్రాణ ఆస్తి నష్టం ఏమైనా సంభవించిందా, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయమై అడిగి తెలుసుకున్నారు.