రాబోయే ఎన్నికల్లో పొత్తులపై ఓ క్లారిటీ ఇచ్చిన పళనిస్వామి..
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓ మహా కూటమికి ఏఐఏడీఎంకే నాయకత్వం వహిస్తుందని ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఇ.కె. పళనిస్వామి ప్రకటన చేశారు. గెలుపు కోసం కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై ఎక్కువగా దృష్టి సారించాలని కోరారు.

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఇ.కె. పళనిస్వామి మంగళవారం నాడు సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓ మహాకూటమికి ఏఐఏడీఎంకే పార్టీ నాయకత్వం వహిస్తుందని ఆసక్తికర ప్రకటన చేశారు.
ఏఐఏడీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో మంగళవారం పళనిస్వామి మాట్లాడుతూ.. 2024లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలో ఓ మహాకూటమికి తమ పార్టీ నాయకత్వం వహిస్తుందన్నారు. అలాగే..ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే కూడా తమ పార్టీయే నిర్ణయిస్తుందని అన్నారు. ఏఐఏడీఎంకేకు 2023వ సంవత్సరం చాలా ముఖ్యమైనదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలోని సమస్యలపై ఎక్కువగా దృష్టి సారించాలని కోరారు. అన్నాడీఎంకేకు పూర్వవైభవం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
పళనిస్వామి పార్టీని పునర్నిర్మించాలని, అన్ని అవకాశాలను ఎదుర్కొని విజయతీరాలకు తీసుకెళ్ళాలని భావిస్తున్నారని సీనియర్ నేత ఒకరు తెలిపారు. నిజానికి పళనిస్వామి పార్టీ తిరుగుబాటు నేత. పార్టీ అధినేత పదవి కోసం పన్నీర్‌సెల్వం, పళని స్వామిల మధ్య పోరు సాగింది. లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని డీఎంకేను మట్టికరిపించి గెలవడమే పళనిస్వామి ఎజెండా అని ఆ నేత అన్నారు. అన్నాడీఎంకే మహాకూటమిగా ఏర్పడుతుందని, పార్టీ గెలుపునకు పార్టీ సభ్యులు పట్టుదలతో పనిచేయాలని పార్టీ జిల్లా ముఖ్యనేతల సమావేశంలో పళనిస్వామి కార్యకర్తలకు సూచించారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి జయ కుమార్ మాట్లాడుతూ, తాము పన్నీర్‌సెల్వం, శశికళ, దినకరన్‌ల గురించి చర్చించలేదని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడం, డీఎంకే ఓడించడం మాత్రమే తమ పార్టీ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐఏడీఎంకే సీనియర్ నేతలు, వివిధ జిల్లాల నేతలు పాల్గొన్నారు.
కాగా, అధికార డీఎంకే ఒక్క కుటుంబ ప్రయోజనాల కోసమే నడుస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఉన్నంత సురక్షితమైన చేతుల్లో తమిళనాడు లేదని ఆయన పేర్కొన్నారు. ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) దేశ శ్రేయస్సు గురించి పెద్దగా శ్రద్ధ చూపడం లేదని, ఎందుకంటే అది ఒక కుటుంబ శ్రేయస్సుపై మాత్రమే శ్రద్ధ చూపుతుందని ఆయన అన్నారు. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం మారాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.