‘‘ నేను ఇంక బతకను, బిడ్డను జాగ్రత్తగా చూసుకో ’’ : చివరిసారిగా భార్యకు పోలీస్ అధికారి వీడియో కాల్
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో డీఎస్పీ హుమాయున్ భట్ వీరమరణం పొందారు. బుల్లెట్ తగిలిన వెంటనే డీఎస్పీ హుమాయూన్ తన భార్య ఫాతిమాకు వీడియో కాల్ చేశారు.

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో డీఎస్పీ హుమాయున్ భట్ వీరమరణం పొందారు. ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్ తగిలిన వెంటనే డీఎస్పీ హుమాయూన్ తన భార్య ఫాతిమాకు వీడియో కాల్ చేశారు. ‘‘తాను ఇక బతకనని, కొడుకుని జాగ్రత్తగా చూసుకో’’ అని చివరి మాటలు మాట్లాడారు.
డీఎస్పీ హుమాయున్‌కు కడుపు భాగంలో బుల్లెట్ దూసుకెళ్లింది. హుమాయున్ గాయపడి పడి ఉన్న ప్రదేశాన్ని గుర్తించేందుకు హెలికాప్టర్‌కు సమయం పట్టిందని అతని అత్తయ్య సయ్యద్ నుస్రత్ చెప్పారు. భద్రతా సిబ్బంది ఎంతో శ్రమించి సంఘటనా స్థలం నుండి నేరుగా శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఫాతిమా , అతని 29 రోజుల కొడుకును చూసిన తర్వాత హుమాయున్ కన్నుమూశారు. సెప్టెంబరు 27న హుమాయున్-ఫాతిమా వివాహానికి ఒక ఏడాది పూర్తవుతుంది. భర్త మరణంతో ఫాతిమా షాక్‌లో ఉంది. అతని తండ్రి గులాం హసన్ భట్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు.
వీర పోలీసు అధికారి కుమారుడి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ధైర్యం, సహనం భారత పోలీసు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. రిటైర్డ్ ఐజిపి గులాం హసన్ భట్ శ్రీనగర్‌లోని జిల్లా పోలీస్ లైన్స్ వద్ద అతని కుమారుడు డిఎస్పీ హుమాయున్ భట్ మృతదేహం దగ్గర మౌనంగా నిలబడి ఉన్నారు. ఏడీజీపీ జావేద్ ముజ్తబా గిలానీతో కలిసి గులాం హసన్ భట్ త్రివర్ణ పతాకం కప్పిన తన కుమారుడి భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, చీఫ్ సెక్రటరీ అరుణ్ మెహతా, డిజిపి దిల్‌బాగ్ సింగ్ , జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖలోని ఇతర సీనియర్ అధికారులందరూ అతని తండ్రి వెనుక నిలబడి అమరుడైన అధికారికి కడసారి వీడ్కోలు పలికేందుకు తమ వంతు కోసం వేచి ఉన్నారు.
కాగా.. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, 19 రాష్ట్రీయ రైఫిల్స్ సీఓ మేజర్ ఆశిష్ ధోంచక్, డీఎస్పీ హుమయూన్ భట్ పాల్గొన్నారు. పారా కమాండోలు గాయపడిన అధికారులను రక్షించే ఆపరేషన్‌లో పాల్గొన్నారు. తీవ్రవాదుల కాల్పులు, పర్వత భూభాగం వంటి కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటూ గాయపడిన అధికారులను తరలించారు. డీజీపీ దిల్‌బాగ్ సింగ్, ఏడీజీపీ విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. దురదృష్టవశాత్తు ఎదురుకాల్పుల్లో ముగ్గురు అధికారులకు తీవ్ర రక్తస్రావమైంది. వీరి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వీరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.