ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులు దేశం విడిచి దుబాయ్ వెళ్లకుండా ఆపాలని తాగిన మత్తులో పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. వారు ప్రయాణించబోతున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్టు బెదిరించాడు. దీంతో ఆ ఫ్లైట్ నిలిచిపోయింది.
న్యూఢిల్లీ: చెన్నైకి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులు దేశం దాటొద్దని అనుకున్నాడు. అందుకు వారిని ఎలా ఆపాలా? అని ఆలోచించాడు. వారు ఎయిర్‌పోర్టు చేరుకున్నారని తెలుసుకుని చివరకు ఆ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. తాగిన మత్తులో ఆ పోలీసులతో మాట్లాడుతూ.. విమానంలో బాంబు పెట్టినట్టు బెదిరించాడు. దీంతో పోలీసులు.. సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు వెళ్లబోయే విమానాన్ని ఆపారు. ఆ విమానం అంతటా వెతికారు. కానీ, బాంబు లభించలేదు. దీంతో కాల్ ఎవరు చేశారని ట్రేస్ ఔట్ చేశారు.
చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 7.20 నిమిషాలకు ఒక ఇండిగో విమానం దుబాయ్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నది. ఇంతలో ఓ వ్యక్తి నుంచి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఆ ఫ్లైట్‌లో బాంబు ఉన్నట్టు ఫోన్ వచ్చింది. పోలీసులు ఆగమేఘాల మీద ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. ఆ ఫ్లైట్ మొత్తం సిబ్బంది తనిఖీలు చేసింది. కానీ, ఎక్కడా బాంబు దొరకలేదు. దీంతో సమాచారం ఇచ్చిన వాడిపై అనుమానం వచ్చింది.
ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ట్రేస్ ఔట్ చేశారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఈ ఫోన్ కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. తన కుటుంబ సభ్యులు దుబాయ్ వెళ్లకుండా ఆపాలనే లక్ష్యంతో ఈ ఫోన్ కాల్ చేసినట్టు ఆ వ్యక్తి తెలిపాడు. ఆ ఫ్లైట్‌లో ప్రయాణించాల్సిన 180 మంది ప్రయాణికులు, సిబ్బందికి అకామడేషన్ కల్పించారు.
