తనను కరిచిందని ఓ వ్యక్తి పామును ముక్కలు ముక్కులుగా కొరికేశాడు.  అనంతరం తనను పాము కరిచింది రక్షించండి అంటూ... ఆస్పత్రికి పరుగులు తీశాడు. ఈ సంఘటన ఉత్తరప్రేదశ్ రాష్ట్రం ఇతా జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఇతా ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి ఫుల్లుగా తాగేసి ఇంట్లో నిద్రపోతున్నాడు.  కాగా... అనుకోకుండా ఇంట్లోకి ప్రవేశించిన ఓ పాము... అతనిని కాటు వేసింది. తాగిన మైకంలో తనను పాము కాటు వేసిన విషయాన్ని గుర్తించి కోపంతో ఊగిపోయాడు. వెంటనే ఆ పాముని పట్టుకొని ముక్కలు ముక్కులుగా కొరికి పారేశాడు.

తర్వాత పాము విషం తనలోకి పాకి తాను చనిపోతానేమోనని భయపడ్డాడు. వెంటనే తేరుకొని తన ఇంటికి సమీపంలోని ఆస్పత్రికి పరుగులు తీశాడు. కాగా.. వైద్యులు వెంటనే స్పందించి అతనికి చికిత్స అందిస్తున్నారు.

కాగా ఈ ఘటనపై రాజ్ కుమార్ తండ్రి స్పందించారు. తన కొడుకు ఆ సమయంలో మద్యం సేవించి ఉన్నాడని చెప్పారు.  ఆ మైకంలోనే పాముని ముక్కలు ముక్కలుగా కొరికేశాడని చెప్పారు. తన కొడుకుకి వైద్యం చేయించే స్థోమత కూడా తనకు లేదని చెప్పారు. డాక్టర్లే దయ ఉంచి వైద్యం చేస్తున్నారని చెప్పారు. అయితే... ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పొలంలో పని చేసుకుంటుండగా... పాము కరించింది. దీంతో.. అతను వెంటనే పాము తల కొరికి నవిలేశాడు. కాగా.. అతనికి వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.