భారత రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము విజయం వైపునకు దూసుకు పోతున్నారు. భారత రాష్ట్రపతి పదవిని అధిష్టించే తొలి గిరిజన మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటికే సగానికి పైగా ఓట్లను ద్రౌపది ముర్ము దక్కించుకున్నారు.
న్యూఢిల్లీ:భారత రాష్ట్రపతి పదవికి NDA అభ్యర్ధి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ద్రౌపది ముర్ము సగానికి పైగా ఓట్లు సాధించారు. భారత 15వ రాష్ట్రపతిగా Droupadi Murmu ప్రమాణం చేయనున్నారు.ఈ నెల 25వ తేదీన ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణం చేస్తారు. మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి ద్రౌపది ముర్ముకు 2,161 ఓల్లు వచ్చాయి. విపక్ష పార్టీల అభ్యర్ధి Yaswant Sinhaకు 1,058 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో మూడో రౌండ్ తర్వాత ద్రౌపది ముర్ముకు దక్కిన ఓటు విలువ 5,77,777 గా నమోదైంది. విపక్ష పార్టీలకు చెందిన యశ్వంత్ సిన్హాకు 2, 61, 062 ఓట్ల విలువ దక్కింది.
తొలి రౌండ్ నుండి ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతుంది.వరుసగా మూడు రౌండ్లలో కూడా ద్రౌపది ముర్ము ఆధిక్యంలో నిలిచారు. ఇంకా నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రస్తుతం సాగుతుంది. మూడు రౌండ్లలోనే ద్రౌపది ముర్ము 50 శాతానికి పైగా ఓట్లను దక్కించుకున్నారు.
మొదటి రౌండ్ లో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు దక్కాయి.రెండో రౌండ్ లో ద్రౌపది ముర్ముకు 809 ఓట్లు వచ్చాయి. యశ్వంత్ సిన్హాకు 329 ఓట్లు వచ్చాయి. ఈ రెండు రౌండ్లను కలిపితే ద్రౌపది ముర్ముకు 1349 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 537 ఓట్లు దక్కాయి.మూడో రౌండ్ లో 812 ఓట్లు ద్రౌపది ముర్ముకు దక్కాయి. యశ్వంత్ సిన్హాకు 521 ఓట్లు వచ్చాయి.
మూడో రౌండ్ లో పంజాబ్,ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ,కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల ఓట్లను లెక్కించారు. ఈ రౌండ్ లో 1333 ఓట్లున్నాయి. వీటిలో 812 ద్రౌపది ముర్ముకు దక్కాయి. యశ్వంత్ సిన్హాకు 521 ఓట్లు వచ్చాయి.
ఒడిశా రాష్ట్రానికి చెందిన ద్రౌపది ముర్ము వయస్సు 64 ఏళ్లు. 2000, 2004లలో ఒడిశా అసెంబ్లీకి ఆమె ఎన్నికయ్యారు. నవీన్ పట్నాయక్, బీజేడీ సంకీర్ణ సర్కార్ లో ఆమె 2000 నుండి 2004 వరకు మంత్రిగా పనిచేశారు. 2015లో జార్ఖండ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.
ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల కోసం పోలింగ్ నిర్వహించారు. దేశంలోని పలు రాష్ట్రాల శాసనసభల పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాలతో పాటు 31 స్థానాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ హౌస్ లో ఎంపీల కోసం ఓటింగ్ కు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 98.91 శాతం పోలింగ్ నమోదైంది.
ముర్ముకు మోడీ అభినందనలు
రాష్ట్రపతిగా విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం నాడు శుభాకాంక్షలు తెలిపారు. ముర్ము నివాసానికి వెళ్లిన మోడీ పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు.
. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,. విపక్ష పార్టీల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. లోక్ సభ స్పీకర్ ఒం బిర్లా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, పలు పార్టీల నేతలు ఆమెను అభినందించారు.
