అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన దంపతులు కొన్ని గంటల్లోనే దారుణ హత్యకు గురయ్యారు. దంపతులను వారి వద్ద పనిచేస్తున్న డ్రైవర్ హత్య చేశాడు. అనంతరం భారీగా బంగారం, నగదుతో పరారయ్యారు.

అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన దంపతులు కొన్ని గంటల్లోనే దారుణ హత్యకు గురయ్యారు. దంపతులను వారి వద్ద పనిచేస్తున్న డ్రైవర్ హత్య చేశాడు. అనంతరం భారీగా బంగారం, నగదుతో పరారయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన తమిళనాడు పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. డ్రైవర్‌పై అనుమానంతో.. అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులకు నిందితుడు పట్టుబడ్డాడు. 

వివరాలు.. చెన్నై మైలాపూర్ బృందావన్ నగర్ ద్వారకా కాలనీకి చెందిన ఆడిటర్ శ్రీకాంత్ (60), ఆయన భార్య అనురాధ (55) మార్చి నెలలో అమెరికాలో ఉంటున్న వారి కూతురు సునంద వద్దకు వెళ్లారు. శనివారం తెల్లవారుజామున వారు అమెరికా నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిని ఎయిర్‌పోర్ట్‌లో పికప్ చేసుకున్న డ్రైవర్ కృష్ణ వారిని ఇంటికి తీసుకెళ్లి దింపాడు. 

అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి సునంద తన తల్లిదండ్రులకు ఫోన్ చేయగా.. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన సునంద సన్నిహితులకు విషయం చెప్పింది. దీంతో వారు ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో వారు మైలాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. కొన్ని గదుల్లో రక్తపు మరకలు కనిపించాయి. 

దీంతో పోలీసుల విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్‌కు ఈసీఆర్‌లోని నెమ్మెలిలో ఫామ్‌ హౌస్ ఉందని.. అతని కారు కూడా కనిపింకుండా పోయిందని గుర్తించారు. వెంటనే శ్రీకాంత్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి కాల్ వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఫాస్ట్‌ట్యాగ్ నుంచి వచ్చిన సందేశాలు.. కాల్ వివవరాల ద్వారా.. శ్రీకాంత్ కారు చెన్నై-కోల్‌కతా జతీయ రహదారిపై వెళ్తున్నట్టుగా గుర్తించారు. దీంతో అక్కడి పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఒంగోలు ఎస్పీ మలికగర్గ్‌ ఆదేశాల మేరకు టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద సింగరాయకొండ సీఐ యం.లక్షణ్‌, టంగుటూరు ఎస్సై ఖాదర్‌బాషా వాహనాలు తనిఖీ చేపట్టారు. కారు నంబరు ముందుగానే తెలియడంతో అప్రమత్తంగా వ్యవహరించారు. సాయత్రం ఆరు గంటలకు కారు రాగానే టోల్‌ప్లాజా వద్ద నిలిపివేశారు. అందులో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నాలుగు సూట్‌కేసుల్లో ఉన్న నగలు, నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. వారిని శ్రీకాంత్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న కృష్ణ, అతని స్నేహితుడు రవిలుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం చేసినట్టుగా కృష్ణ అంగీకరించారు. 

శ్రీకాంత్, అనురాధ దంపతులను హత్య చేసి.. డబ్బు, ఇతర విలువైన వస్తువులను దోచుకున్నట్లు కృష్ణ అంగీకరించాడు. మృతదేహాలను తమ ఫామ్‌హౌస్‌లో పూడ్చిపెట్టినట్లు కూడా చెప్పాడు. దీంతో పోలీసులు ఫామ్‌హౌస్‌లో మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టమ్ నిమిత్తం చెంగల్‌పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ దంపతులను హత్య చేయాలని కృష్ణ ముందుగానే ప్లాన్ చేసి ఉంటాడని.. ముందుగానే వారిని పాతిపెట్టేందుకు అనువుగా గోయ్యి తీసి ఉంచాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ కోసం వారిని మైలాపూర్ తరలించారు.

ఇక, నేపాల్‌కు చెందిన కృష్ణ గత ఏడేళ్లుగా శ్రీకాంత్ దంపతుల వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని తల్లిదండ్రులు నెమ్మెలిలోని శ్రీకాంత్ ఫామ్‌హౌస్‌లో పనిచేసేవారు. అయితే గత నెలలో కృష్ణ.. వారిని తిరిగి నేపాల్‌కు పంపించాడు. ఇక, కృష్ణతో పాటుగా పట్టుబడిన రవిని డార్జిలింగ్‌కు చెందినవాడు.