Asianet News TeluguAsianet News Telugu

యాక్సిడెంట్ అయ్యిందని పరామర్శించబోతే.. కట్టేసి, చెప్పులతో కొట్టారు...

సింగ్రౌలి జిల్లా రాంపూర్వా గ్రామంలో ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే అతని బంధువులు వాహన యజమానిని కట్టేసి, చెప్పులతో కొట్టారు.

driver died in a tractor accident, relatives tied up tractor owner and hit with slippers in madhyapradesh
Author
First Published Dec 27, 2022, 8:06 AM IST

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ ట్రాక్టర్ ప్రమాదంలో వాహనం తిరగబడి.. డ్రైవర్ కి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, డ్రైవర్ ను ఆస్పత్రిలో చేర్చించడానికి వచ్చిన.. ట్రాక్టర్ యజమానిని మృతుని బంధువులు అక్కడి రెయిలింగ్ కు కట్టేసి, చెప్పులతో కొట్టడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానిక ట్రామా సెంటర్ ఆవరణలో జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

సింగ్రౌలి జిల్లా రాంపూర్వా గ్రామంలో డ్రైవర్ మర్దన్ సింగ్ నడుపుతున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ గాయపడి ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే అతని మృతికి వాహన యజమానే కారణం అంటూ..  బంధువులు అతడిని కట్టేసి, కొట్టారు. దీనిమీద పోలీసులు మాట్లాడుతూ.. ప్రమాదం గురించి తెలుసుకున్న ట్రాక్టర్ యజమాని అమిత్ వైష్.. హుటాహుటిన ప్రమాదస్థలానికి చేరుకుని డ్రైవర్‌ను ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లినట్లు స్థానిక పోలీసు సీనియర్ అధికారి శివ కుమార్ వర్మ తెలిపారు. అయితే, ట్రామా సెంటర్ లో చికిత్స పొందుతూ డ్రైవర్ చనిపోయాడు.

గుజరాత్ యూనివర్సిటీలో నమాజ్ చేసిన విద్యార్థులు.. వీడియో వైరల్ కావడంతో వివాదం..

అతని బంధువులను ఓదార్చేందుకు అమిత్ వైష్ వెళ్లాడు. అయితే మర్దన్ సింగ్ చనిపోవడానికి అమిత్ వైష్ కారణం అని అతని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని కట్టేసి చెప్పులతో కొట్టారు. ఇంత జరుగుతుంటే.. అతనికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దూరంగా నిలబడి చోధ్యం చూస్తూ... ఘటన మొత్తాన్ని సెల్‌ఫోన్‌లలో రికార్డు చేశారు. వాటిని సోషల్ మీడియాలో వీడియోలను అప్‌లోడ్ చేశారు.

వైష్ ఎలాగోలా వారినుంచి తప్పించుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మర్దాన్ సింగ్ బంధువులను ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రి సెక్యూరిటీ గార్డును పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios