మనదేశంలో ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాల్లో యువత ఎక్కవగా వెళ్లడానికి ఇష్టపడేది గోవానే. ఎందుకంటే.. అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ..మద్యం ఇష్టం వచ్చినట్లు తాగొచ్చనే కారణంతో. కానీ ఇక నుంచి ఆ అవాకశం లేదు. అక్కడ బీచ్ లో మద్యం తాగితే,.. రూ.2వేలు జరిమానా, మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

గోవా ప్రభుత్వం పర్యాటక చట్టంలో మార్పులు తీసుకురాబోతుంది. బీచ్‌లో మద్యం తాగినా, బహిరంగంగా వంట చేసినా రెండువేల రూపాయలు జరిమానా విధించాలని గోవా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  గోవాలో కాలుష్యాన్ని నివారించేందుకు వీలుగా ఈ ఆంక్షలు విధించాలని గోవా మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. ఒకవేళ  జరిమానా చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని మంత్రి పేర్కొన్నారు.

‘  పర్యాటక చట్టంలో మేం రెండు మార్పులు తీసుకొచ్చాం. పర్యాటకశాఖలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాతనే హోటల్‌ బుకింగ్‌ చేసుకునేలా నిబంధనను తీసుకొచ్చాం. ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు మా దృష్టికి వచ్చాయి. చాలా ట్రావెల్స్‌ కంపెనీలు పర్యాటకశాఖతో సంబంధం లేకుండా హోటల్స్‌ను బుక్‌ చేస్తున్నాయి. ఈ తరహా చట్ట వ్యతిరేక పనులను మేం సహించం. ఇక రెండోది.. బహిరంగ ప్రదేశాల్లో, బీచ్‌లో మద్యం సేవించినా, వంట చేసినా రూ.2 వేలు జరిమానా కట్టాల్సిందే. లేకుంటే మూడు నెలలు జైలు శిక్షఅనుభవించాలి.’ అని పర్యాటక మంత్రి తెలిపారు.