Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్నంలో కోటి విలువైన బంగారం పట్టివేత..బంగ్లాదేశ్ నుంచి స్మగ్లింగ్

సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విశాఖపట్నం ప్రాంతీయ విభాగం అధికారులు శనివారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1.07 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

DRI seizes 1.86 kg smuggled gold from Bangladesh, worth 1.07 crore in Visakhapatnam
Author
First Published Jan 8, 2023, 5:32 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1.86 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడి బంగారం విలువ రూ.కోటి వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగ్లాదేశ్ నుంచి విశాఖకు అక్రమంగా  బంగారాన్ని తీసుకొచ్చినట్లు డీఆర్‌ఐ శనివారం వెల్లడించింది.

బంగారం స్మగ్లింగ్ గురించి విశ్వసనీయ సమాచారం ఆధారంగా కస్టమ్స్ అధికారులు జనవరి 5 న విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో కోల్‌కతా నుండి షాలిమార్-సికింద్రాబాద్ ఎసి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం.12773)లో వచ్చిన ఒక వ్యక్తిని మరియు స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌కు వచ్చిన మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  వారిద్దరిని సోదాలు చేయగా.. నిందితుల నుంచి రూ.1.07 కోట్ల విలువైన 1860.5 గ్రాముల బంగారాన్ని (కడ్డీలు, ముక్కల రూపంలో) స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి నుంచి రాబట్టిన సమాచారం ప్రకారం పలుచోట్ల సోదాలు చేశారు. ఆ తర్వాత బంగారు దుకాణం యజమాని నివాసంలో సోదాలు నిర్వహించామని, అక్కడ కొన్ని అభ్యంతరకర అంశాలు లభించాయని డీఆర్‌ఐ తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసి కోల్‌కతాలో కరిగించి బంగారు కడ్డీలుగా, వివిధ పరిమాణాల్లోని ముక్కలుగా మార్చి సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఆర్‌ఐ తెలిపింది. బంగారం స్మగ్లింగ్ ఆరోపణలపై అరెస్టు చేసిన వ్యక్తులపై కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి విశాఖపట్నం సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు ప్రకటన పేర్కొంది.

 
 బంగారంపై కేంద్రం కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో దేశంలోకి అక్రమంగా బంగారం రవాణా ఎక్కువైంది. ఈ విషయాన్ని గమనించిన  కస్టమ్స్ అధికారులు.. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో.. రైల్వే స్టేషన్లలో ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో సంచలన విషయాలు బయట పడ్డాయి. అక్రమార్కులు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు.  గతేడాది (2022) వివిధ దర్యాప్తు సంస్థలు 3000 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం వెల్లడించింది. గత మూడేండ్లల్లో ఇదే అత్యధిక మొత్తంలో పట్టివేత కావడం గమనార్హం.  అంతకు ముందు 2019లో 3678 కిలోల బంగారాన్ని స్మగ్లర్ల నుంచి కేంద్రం జప్తు చేసింది.

గతేడాది  దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ బంగారు రవాణా సంబంధించి 3,500పైగా కేసులు నమోదు కాగా..
3,081.61 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021లో 2,383 కిలోల బంగారం, 2020లో 2,154 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో అత్యధికంగా కేరళలో  690 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా.. మహారాష్ట్రలో 474 కిలోలు, తమిళనాడులో 440 కేజీలు, పశ్చిమ బెంగాల్ లో 369 కిలోల బంగారాన్ని అధికారులు జప్తు చేశారు. అక్రమంగా బంగారాన్ని రవాణా చేయకుండా అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం పటిష్టమైన చేపడుతున్నట్టు వెల్లడించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios