Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీకి కొత్త ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్: స్మగ్లర్ల ఎత్తుగడ .. చిత్తు చేసిన డీఆర్ఐ, విలువ రూ.434 కోట్లు

ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు డీఆర్ఐ అధికారులు. ఉగాండా నుంచి ఢిల్లీకి అంతర్జాతీయ కార్గో ద్వారా పంపిన హెరాయిన్‌ను పట్టుకున్నారు. దీని విలువ రూ.434 కోట్ల పైమాటేనని అధికారులు అంటున్నారు. 

DRI Officials seizes heroin worth Rs 434 crore at IGI Airport
Author
New Delhi, First Published May 11, 2022, 5:23 PM IST

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎంతగా నిఘా పెడుతున్నా దేశంలోకి డ్రగ్స్ (drugs) ఏదో ఒక మార్గంలో వస్తూనే వున్నాయి. తాజాగా ఢిల్లీలో అంతర్జాతీయ కార్గోలో (international cargo delhi) భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.434 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్ చేశారు డీఆర్ఐ (dri) అధికారులు. ఉగాండా నుంచి ఢిల్లీ వచ్చిన పార్శిల్‌లో హెరాయిన్‌ను గుర్తించారు. ట్రాలీ బ్యాగుల కింద తెలుపు రంగు హెరాయిన్‌ను తరలించారు కేటుగాళ్లు. మొత్తం 126 ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్‌ను దాచారు స్మగ్లర్లు. విమానాల్లో తరలిస్తే దొరికిపోతామని స్మగ్లర్లు ఈ కొత్త స్కెచ్ గీశారు. ఢిల్లీకి పార్శిల్ ద్వారా మొత్తం 330 కొత్త బ్యాగుల్ని పంపారు స్మగ్లర్లు. 

ఇకపోతే.. గత నెల 30న గుజరాత్​ యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్​(ఏటీఎస్​), డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇటెలిజెన్స్​(డీఆర్​ఐ) సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో.. పిపావావ్​ పోర్ట్‌లోని ఓ కంటైనర్‌లో దాదాపు 90 కిలోల హెరాయిన్​ పట్టుబడింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.450 కోట్లకుపైనే ఉంటుందని రాష్ట్ర డీజీపీ ఆశిశ్​ భాటియా తెలిపారు. ఇరాన్​లోని అమ్రేలి జిల్లా నుంచి దీనిని త‌ర‌లించిన‌ట్టు చెప్పారు. 

అధికారుల కళ్లుగప్పి మత్తుపదార్థాలను చేరవేసేందుకు డ్రగ్​ సిండికేట్.. హెరాయిన్​తో కూడిన ద్రావణంలో ధారాలను నానబెట్టే.. ఆ తర్వాత వాటిని కాల్చి, వచ్చిన పొడిని ప్యాకింగ్​ చేసి ఎగుమతి చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. గత వారం రోజుల్లో  గుజరాత్‌లో  2180 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడింద‌ని రాష్ట్ర డీజీపీ ఆశిశ్​ భాటియా తెలిపారు. గుజరాత్‌ ఏటీఎస్‌, డీఆర్‌ఐ, కస్టమ్స్‌ సంయుక్త ఆపరేషన్‌లో ఈ డ్రగ్స్‌ పట్టుబడ్డాయని, గత వారం రోజుల్లో వివిధ దాడుల్లో 436 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయని తెలిపారు. 

అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్‌లు జరిపిన ఆపరేషన్‌లో 9 మంది పాకిస్థానీలతో పాటు 'అల్ హాజ్' అనే బోటును పట్టుకున్నట్లు గుజరాత్ డీజీపీ తెలిపారు. అందులో నుంచి 56 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ బృందాన్ని ఢిల్లీకి పంపినట్లు డీజీపీ తెలిపారు. అలాగే.. ముజఫర్‌నగర్‌లో 35 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలిపారు. ఇది కాకుండా.. ఎసిటిక్ అన్‌హైడ్రైడ్ బారెల్స్ కూడా కనుగొనబడ్డాయి. 4 మంది నిందితులను అరెస్టు చేశారు.  ATS-NCB యొక్క జాయింట్ ఆపరేషన్ నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు.

గుజరాత్ డిజిపి ప్రకారం, ఇద్దరు నిందితులను గుజరాత్ ఎటిఎస్ అరెస్టు చేయ‌గా.. మరో ఇద్దరిని ఎన్‌సిబి విచారిస్తోంది. దీని ఆధారంగా షాహీన్ బాగ్ (ఢిల్లీ)లో మరో 30 లక్షల రూపాయలతో సహా 50 కిలోల హెరాయిన్, మరికొన్ని పౌడర్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం కాండ్లా ఓడరేవులో కంటైనర్‌లో 205 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.  DRI ద్వారా తదుపరి విచారణ జరుగుతోంది. ప్రధాన నిందితుడు జోబన్ సింగ్‌ను తరన్ తరణ్ నుంచి పట్టుకున్నారు. రిమాండ్‌కు తరలించి విచారిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios