ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారితోపాటు.., బ్లాక్ ఫంగస్ కూడా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో దాదాపు 55శాతం మందికి మధుమేహం ఉందని.. వారికే ఈ ఫంగస్ ఎక్కువగా సోకుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ పేర్కొన్నారు.

తాజాగా మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 రష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 5,425 మ్యుకర్ మైకోసిస్ కేసులు వెలుగు చూశాయన్నారు.  వారిలో 4,556మందికి కరోనా సోకిందని చెప్పారు. మొత్తం బాధితుల్లో 55శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నవారు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

వాతావరణంలో సహజంగా ఉండే మ్యుకర్ అనే ఫంగస్ వల్ల ఈ వ్యాధి సోకుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా కరోనా సోకి.. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికీ లేదా.. అతి స్పందించకుండా రోగనిరోధక వ్యవస్థను కట్టడి చేయడానికి స్టెరాయిడ్లను మితిమీరి వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే ప్రమాదం ఉందని అన్నారు. అవయవ మార్పిడి జరిగిన వారికీ.. ఐసీయూలో చికిత్స పొందిన వారికి దీని ముప్పు ఎక్కువగా ఉంటుదన్నారు. గాలి పీల్చుకునేటప్పుడు ఈ ఫంగస్ సైనస్, ఊపిరితిత్తులకు చేరుతుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా ఉన్న సమయంలో.. ఈ తరహా కేసులు పెరుగుతుండటం అందరికీ కలవపెరుడుతోంది.