సారాంశం

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసంచేసిన ఘటన పంజాబ్ లో వెలుగుచూసింది. ఈ ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. 

BR Ambedkar : రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ కు పంజాబ్ లో ఘోర అవమానం జరిగింది. రాజ్యాంగాన్ని ఎంతో ఉన్నతంగా భావిస్తూ సగౌరవం అందించే భారత గణతంత్ర దినోత్సవం రోజేనే రాజ్యాంగనిర్మాతకు ఈ అవమానం జరగడం దారుణం. పంజాబ్ లోని  అమృత్ సర్ లో గత నెల జనవరి 26న అంబేద్కర్ భారీ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసారు. ఈ ఘటన డిల్లీ ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా మారింది. 

ప్రస్తుతం డిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటనను బిజెపి, కాంగ్రెస్ బాగా వాడుకుంటున్నాయి. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో దళితులపై ఎలాంటి అమానుష ఘటనలు జరుగుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని అంటున్నారు. దళితులు దేవుడిలా కొలిచే అంబేద్కర్ విగ్రహాన్ని గణతంత్ర దినోత్సవంరోజే ధ్వంసం చేసినా చర్యలు తీసుకోవడంలేదని అంటున్నారు.

బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటనపై స్పందించారు. తమ పార్టీ పాలిస్తున్న రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై ఆప్ అధినేత,డిల్లీ మాజీ  సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనకు పాల్పడినవారికి గుర్తించి చర్యలు తీసుకోవాలని బిజెపి నేత కోరారు. 

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటనపై రియాక్ట్ అయ్యింది. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన పంజాబ్ కాంగ్రెస్ నాయకులు దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ అయితే ఇది ఆప్ ఖలిస్తానీ శక్తుల కుట్రగా పేర్కొన్నారు. 

ఇలా రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం ఘటన నేపథ్యంలో ఆప్ తీవ్ర విమర్శలకు గురవుతోంది. దళిత సంఘాలు కూడా ఈ ఘటనపై వెంటనే ప్రభుత్వం స్పందించి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.