ముంబై: 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 68 ఏళ్ల నిందితుడు జలీల్ అన్సారీ పోలీసులకు టోకరా ఇచ్చాడు. గురువారం ఉదయం నుంచి ఆయన కనిపించడం లేదు. అతను పెరోల్ పై ఉన్న అతను పోలీసుల కళ్లు గప్పి పారిపోయినట్లు భావిస్తున్నారు. 

జలీల్ అన్సారీ అగ్రిపడలోని మోమిన్ పురాకు చెందినవాడు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతను దేశవ్యాప్తంగా పలు బాంబు పేలుళ్ల ఘటనల్లో పాలు పంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

అతను 21 రోజుల పెరోల్ పై రాజ,స్థాన్ లోని అజ్మీర్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యాడు. శుక్రవారంనాడు అతను జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సి ఉండింది. పెరోల్ లో ఉన్న సమయంలో ప్రతి రోజూ ఉదయం 1030 నుంచి 12 గంటల మధ్య అగ్రిపడ పోలీసు స్టేషన్ కు వచ్చి హాజరు వేసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయి. 

అన్సారీ గురువారంనాడు నిర్ణీత సమయంలో అతను పోలీసు స్టేషన్ కు రాలేదు. సాయంత్రం జలీల్ అన్సారీ కుమారుడు జైద్ అన్సారీ (35) పోలీసు స్టేషన్ కు వచ్చి తన తండ్రి కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. 

ఆ ఫిర్యాదు ప్రకారం.... జలీల్ అన్సారీ గురువారం తెల్లవారు జామున నిద్ర లేచి నమాజుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. అగ్రిపడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. 

అతని కోసం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, మహారాష్ట్ర ఏటీఎస్ సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. జలీల్ ను డాక్టర్ బాంబుగా పిలుస్తారు. సిమీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధాలున్నాయి. ఉగ్రవాదులకు అతను బాంబు తయారీలో శిక్షణ ఇచ్చేవాడని అంటారు.

ముంబైలో 2008లో జరిగిన బాంబు పేలుళ్లపై కూడా జలీల్ అన్సారీని ఎన్ఐఎ ప్రశ్నించింది.