తమిళనాడులోని రామనాథపురంలో అమానుష ఘటన జరిగింది. మూఢ నమ్మకాల పేరుతో ఓ తండ్రి కన్న కూతురినే పొట్టన పెట్టుకున్నాడు. మదనపల్లె జంట హత్యలలాంటి మూఢనమ్మకమే ఈ కేసులోనూ ఓ నిండు ప్రాణం బలయ్యేందుకు కారణమయ్యింది. 

దారుణమైన ఈ ఘట వివరాల్లో వెడితే.. తమిళనాడు, రామనాథపురానికి చెందిన వీరసెల్వం విపరీతంగా మూఢనమ్మకాలు, తాంత్రిక పూజలను నమ్ముతాడు. వీరసెల్వం భార్య కొంతకాలం క్రితం మరణించింది. ఆయనకు ఓ కూతురు తరుణి(19) ఉంది. ఆమె గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. 

తరుణి ఇటీవల తన తల్లి సమాధి దగ్గరికి వెళ్లివచ్చింది. ఆ తరువాతే అనారోగ్యం బారిన పడింది. దీంతో తన భార్య ఆత్మ తరుణి శరీరంలోకి ప్రవేశించిందని అందువల్లనే ఆమె అనారోగ్యానికి గురైనట్లు వీరసెల్వం భావించాడు. అందుకే ఏదేమైనా తరుణి శరీరం నుంచి తన భార్య ఆత్మను బయటకు పంపించాలని తాంత్రికపూజలు చేయడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే భార్య ఆత్మను, కూతురు శరీరంలో నుంచి వెళ్లగొట్లాలని ఆమె మెడ, నడుం పై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే తరుణి మృతి చెందినట్లు వైద్యులు చెప్పేశారు. తరుణి మృతికి టైఫాయిడ్ జ్వరమే కారణమని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.