UP Assembly Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. గురువారం మొరాదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ఇంటింటికీ ప్రచారం రోడ్‌షోలా ఉందని పేర్కొంటూ ఉత్తరప్రదేశ్ పోలీసులు కాంగ్రెస్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. 

UP Assembly Election 2022: దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రారంభ‌మ‌య్యాయి. తొలిద‌శ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. ఇక రెండో ద‌శ ఎన్నిక‌ల కోసం రాజ‌కీయ పార్టీల‌న్ని ముమ్మ‌రంగా ప్ర‌చారం సాగిస్తున్నాయి. అయితే, క‌రోనా నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం ప‌లు ఆంక్ష‌లు విధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం సైతం క‌రోనా ఆంక్ష‌ల‌ను కొన‌సాగిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇంటింటి ప్రచారంపై ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. అయితే, గురువారం కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ఇంటింటి ప్రచారం రోడ్‌షోలా ఉందని పేర్కొంటూ ఉత్తరప్రదేశ్ పోలీసులు కాంగ్రెస్‌పై కేసు నమోదుచేశారు. మొరాదాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి రిజ్వాన్‌ ఖురేషీ గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) కలిసి నగరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దీనికి జ‌నాలు నుంచి పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింది. భారీగా ప్ర‌జ‌లు ఆమె వెంట న‌డిచారు. దీంతో ఈ ఇంటింటి ఎన్నిక‌ల ప్ర‌చారం రోడ్‌షోలా కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

మొరాదాబాద్ (Moradabad) పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అఖిలేష్ భడోరియా మీడియాతో మాట్లాడుతూ, "కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ (Rizwan Qureshi) ఇంటింటికీ ప్రచారానికి అనుమతి తీసుకున్నారని, అయితే కారుపై ఉన్న వ్యక్తులతో రోడ్‌షో లాంటి పరిస్థితి ఏర్పడినట్లు కనిపించింది. సెక్టార్ మేజిస్ట్రేట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది" అని వెల్ల‌డించారు. దీనిపై కాంగ్రెస్ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. రాష్ట్ర అధికార యంత్రాంగం ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులపై ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని రిజ్వాన్ ఖురేషీ ప్రశ్నించారు. రిజ్వాన్ ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల చర్యను ప్రశ్నించారు. అనేక ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీపై ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని అన్నారు. హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్ హండా నిర్వహించిన ర్యాలీలను ఎత్తిచూపారు.

"కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ ఇంటింటికీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. మీరట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. వారిపై ఎఫ్‌ఐఆర్ ఎందుకు లేదు? ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తే మా తప్పు కాదు. ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ కు ప్ర‌జ‌లు ప్రేమ‌తో బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అందుకే బీజేపీకి భ‌యం ప‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలోనే కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి’’ అని ఖురేషీ ఆరోపించారు. మొరాదాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఖురేషీ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఇంటింటికీ ప్రచారం చేస్తుండగా, జనం పోటెత్తారు. ఖురేషీ కారులో అతనితో పాటు పలువురు వ్యక్తులు కనిపించారు. దీంతో మొరాదాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నిక‌లకు ఫిబ్రవరి 10న ఓటింగ్ జరిగింది. జాట్‌ల ప్రాబల్యం ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేద‌ని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 14న జరగనుంది. సహారన్‌పూర్, బిజ్నోర్, అమ్రోహా, సంభాల్, మొరాదాబాద్, రాంపూర్, బరేలీ, బుదౌన్, షాజహాన్‌పూర్‌లోని తొమ్మిది జిల్లాల పరిధిలో మొత్తం 55 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు దశల్లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (UP Elections 2022) ఫ‌లితాలు మార్చి 10న వెల్ల‌డికానున్నాయి.