గృహిణిని తక్కువ అంచనా వేయొద్దు.. ఆమె సేవలను వెలకట్టలేం - సుప్రీంకోర్టు

గృహిణి విలువను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆమె సేవలను డబ్బలు రూపంలో లెక్కించడం కష్టమని తెలిపింది. ఇంట్లో సంపాదించే వ్యక్తి ఎంత ముఖ్యమే.. గృహిణి కూడా అంతే ముఖ్యమని పేర్కొంది.

Dont underestimate a housewife. Her services cannot be valued - Supreme Court..ISR

ఓ ఇంట్లో సంపాదించే వ్యక్తి ఎంత ముఖ్యమో.. అదే ఇంట్లో గృహిణి పాత్ర కూడా అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. గృహిణి చేసే అపారమైన పని విలువను గుర్తించింది. ఇంటి బాధ్యతలను నిర్వర్తించడం అంత సులభం కాదని తెలిపింది. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాద కేసులో పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచుతూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ కూడిన ధర్మసానం ఈ వ్యాఖ్యలు చేసింది. 

ఇంట్లో ఆదాయం గణనీయంగా ఉన్న సభ్యుడి పాత్ర ఎంత ముఖ్యమో గృహిణి పాత్ర కూడా అంతే ముఖ్యమని కోర్టు తెలిపింది. గృహిణి చేసే కార్యకలాపాలను ఒక్కొక్కటిగా లెక్కిస్తే, అది చాలా పెద్ద మొత్తంలో ఉంటుదని, అమూల్యమైనది అనడంలో ఎలాంటి సందేహమూ లేదని పేర్కొంది. అయితే ఆమె సేవలను ద్రవ్యపరంగా లెక్కించడం కష్టమని వ్యాఖ్యానించింది.

2006లో ఉత్తరాఖండ్ కు చెందిన ఓ గృహిణి రోడ్డు ప్రమాదానికి గురై మరణించింది. అయితే యాక్సిడెంట్ కు కారణమైన వాహన యజమాని బాధిత కుటుంబానికి కి రూ.2.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మోటారు యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే పరిహారం పెంచాలని బాధిత కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. కానీ 2017లో వారి అప్పీల్ ను కోర్టు తిరస్కరించింది.

మృతురాలు గృహిణి కాబట్టి ఆమె ఆయుర్దాయం, కనీస ఆదాయం ఆధారంగా పరిహారాన్ని అంత కంటే ఎక్కువ ఇవ్వాలని ఆదేశించలేమని అక్కడి హైకోర్టు తెలిపింది. దీంతో బాధిత కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం.. ఉత్తరాఖండ్ హైకోర్టు వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. గృహిణి ఆదాయం రోజువారీ వేతన జీవి ఆదాయం కంటే తక్కువగా పరిగణించడం సరికాదని, ఇలాంటి విధానం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. 

పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచుతూ ఆ మొత్తాన్ని ఆరు వారాల్లోగా మృతురాలి కుటుంబానికి చెల్లించాలని వాహన యజమానిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా గృహిణి పాత్ర ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన కోర్టు.. ఆమె విలువను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios