సింగపూర్ లో కొత్త స్ట్రెయిన్ ఉందంటూ, అది భారతదేశంలోకి ప్రవేశించి థర్డ్ వేవ్ ని సృష్టించే అవకాశం ఉన్నందున సింగపూర్ నుండి వచ్చే విమానాలపై వెంటనే నిషేధం విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిన్న సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్న విషయంపై ఇటు భారత ప్రభుత్వం, అటు సింగపూర్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించాయి. 

అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సింగపూర్ లోని భారత హై కమీషనర్ ని సింగపూర్ ప్రభుత్వం పిలిపించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతే కాకుండా సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ట్విట్టర్ వేదికగా అరవింద్ కేజ్రీవాల్ కి హితవు పలికారు. 

కేజ్రీవాల్ వ్యాఖ్యలు భారత ప్రభుత్వ వైఖరి కాదని, సింగపూర్ భారత్ కి ఈ కరోనా కష్టకాలంలో తోడుగా నిలిచిందని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సింగపూర్ విదేశాంగ మంత్రికి ట్విట్టర్ ద్వారా తెలియజేసారు కూడా. భారత్, సింగపూర్ దేశాల మధ్య స్నేహం ఇలానే కొనసాగాలని ఆయన కోరడంతో, అది ధృడంగా కొనసాగుతుందని సింగపూర్ విదేశాంగ మంత్రి స్పందించారు. 

ఈ విషయంపై ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి చురకలు అంటించారు. తమ పరిపాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేసి మిత్ర దేశాలతో వైరం తెచ్చేలా ప్రవర్తించడం సరికాదని అన్నారు

తమ లోపాలను కప్పిపుచ్చి, ప్రజల దృష్టికి మరల్చడానికి రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ల మధ్య పోరు నడుస్తుందని, ఇది దానికి సాక్ష్యం అని వ్యాఖ్యానించారు రాజీవ్ చంద్రశేఖర్.