Asianet News TeluguAsianet News Telugu

Constitution Day: దురుద్దేశపూరిత దాడుల నుంచి జ్యుడీషియరిని రక్షించాలి: సీజేఐ రమణ సంచలన వ్యాఖ్యలు

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దురుద్దేశపూరిత, లక్షిత దాడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడాలని ఆయన న్యాయవాదులకు సూచనలు చేశారు. సత్యం వైపు నిలబడటానికి సంకోచించవద్దని, తప్పును ఎత్తి చూపడానికి వెనుకడుగు వేయవద్దని అన్నారు. చివరగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొటేషన్‌ను ప్రస్తావిస్తూ ప్రసంగాన్ని ముగించారు.

dont shy to stand with truth says CJI NV ramana on constitution day
Author
New Delhi, First Published Nov 26, 2021, 5:23 PM IST

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ దినోత్సవం(Constitution Day) సందర్భంగా సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(CJI NV Ramana) సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. దురుద్దేశపూరిత, లక్షిత దాడుల నుంచి న్యాయ వ్యవస్థ(Judiciary)ను రక్షించాలని న్యాయవాదులకు సూచనలు చేశారు. భారత రాజ్యాంగం చర్చించడానికి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుందని, చర్చ జరిగితేనే అంతిమంగా దేశం అభివృద్ధి దిశగా సాగుతుందని, ఉన్నత స్థాయిలను సమాజం అందుకుంటుందని వివరించారు. భారత రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వం 1949 నవంబర్ 26న ఆమోదించారు. తర్వాతి ఏడాది జనవరి 26న అమలు చేశారు. అందుకే జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా మనం వేడుకలు చేసుకుంటాం. కాగా, నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవంగా గుర్తిస్తారు.

న్యాయవాదులూ అవసరమైనప్పుడు న్యాయమూర్తులకు సూచనలు చేయవచ్చునని, తద్వార కొన్ని దురుద్దేశపూరిత దాడుల నుంచి న్యాయ వ్యవస్థను కాపాడినవారు అవుతారని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ‘మనదంతా ఒకే కుటుంబం. లక్షిత, దురుద్దేశపూర్వక దాడుల నుంచి న్యాయ వ్యవస్థను రక్షించాలి. సత్యం వైపు నిలబడటానికి సంకోచించవద్దు. తప్పును నిర్ద్వంద్వంగా ఎత్తి చూపండి’ అంటూ సూచనలు చేశారు. ‘మన దేశం, మన ప్రజలను నిర్వచించిన రాజ్యాంగాన్ని 72ఏళ్ల కింద ఆమోదించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమర యోధులను, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులకూ వినమ్రంగా నా ధన్యావాదాలు తెలుపుతున్నాను. న్యాయవ్యవస్థలో నేను భాగంగా ఉన్నందుకు సంతోషపడుతున్నాను’ అని అన్నారు.

Also Read: Constitution Day : రాష్ట్రపతి నేతృత్వంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..

భారత రాజ్యాంగానికి మౌలిక ఆలోచనలైనా స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే వాటిపై ప్రజల్లో చర్చ జరపాలని, వారిలో అవగాహన కల్పించాలని సీజేఐ రమణ అన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ, లాలా లజ్‌పత్ రాయ్, సర్దార్ పటేల్, అల్లాడి క్రిష్ణస్వామి అయ్యర్ సహా మరెందరో లాయర్లు చేసిన కృషిని సదా స్మరించాలని తెలిపారు. అంతటి ఘన చరిత్రకు ఇప్పుడు మనం వారసులమని న్యాయవాదులతో అన్నారు. కాబట్టి, స్వతంత్ర భారత పౌరుడిగా ఉన్నందుకు ప్రతి ఒక్కరు గర్వించాలని అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటి కంటే ఇప్పుడు అది మరింత సుసంపన్నమైందని, సంక్లిష్టమైందని సీజేఐ ఎన్వీ రమణ వివరించారు. ఎందుకంటే ఆమోదించినప్పటి నుంచి న్యాయ పరమైన అంశాలపై కోర్టు లోపలా, వెలుపులా విస్తృత చర్చ జరిగిందని, ఇప్పటికీ జరుగుతున్నదని తెలిపారు. తద్వారా రాజ్యాంగం మరింత బలపడటానికి ఆస్కారం ఏర్పడిందని అన్నారు. ‘ఈ విజన్ డాక్యుమెంట్ సృష్టించిన గొప్ప గొప్ప పురుషులు, మహిళలు అడుగుల్లో మీరు నడుస్తున్నారు. ఆ విజన్‌ను మరింత మెరుగు పరచడంలో మీరు ప్రత్యక్ష భాగస్వాములు. రాజ్యాంగం, చట్టాలపై విస్తృత పట్టు ఉన్న మీపై సమాజంలోని ప్రతి పౌరుడి పాత్ర గురించి అవగాహన కల్పించే బాధ్యత కూడా ఉంటుంది. దేశ చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు కూడా మీ భుజాలపై ఉన్నది. ఇది భారంగానే ఉండొచ్చు కానీ, మోయాల్సిన భారమే’ అని అన్నారు. తన ప్రసంగాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొటేషన్‌తో ముగించారు. మనుషులు మరణిస్తారని, ఐడియాలూ మరణిస్తాయని అన్నారు. ఒక మొక్కకు నీరు ఎలా అవసరమో.. ఏ ఆలోచన అయినా సరే అది మనగలగాలంటే దాని విస్తరణ, చర్చ అవసరమని పేర్కొన్నారు. లేదంటే ఆ రెండూ మరణిస్తాయని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios