న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మద్యం తాగొద్దని ఐఎండీ సూచించింది.

మద్యం తాగితే శరీర ఉష్ణోగ్రతలను  మరింత తగ్గించే అవకాశం ఉందని  ఐఎండీ తెలిపింది. ఉష్ణోగ్రతలు పడిపోవడం కారణంగా  తీవ్రమైన జలుబు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

జలుబును ఎదుర్కొనేందుకు గాను విటమిన్ సీ అధికంగా ఉండే పండ్లను తినాలని సూచించారు నిపుణులు. పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో  ఉష్ణోగ్రతలు ఈనెల 28వ తేదీ నుండి భారీగా పడిపోయే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.

ఆది,సోమవారాల్లో ఉత్తరాదిన మంచు ప్రభావం పెరగనుందని ఐఎండీ ప్రాంతీయ హెచ్చరికల విభాగం చీఫ్ కుల్దీప్ శ్రీవాస్తవ వెల్లడించారు.కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పుడు లేదా గరిష్ట ఉష్ణోగ్రత 4.5 డిగ్రీల సెంటిగ్రేడ్  లేదా 6.4 డిగ్రీల కంటే  తగ్గితే ఆ రోజును చల్లని రోజు లేదా తీవ్రమైన చల్లని రోజుగా వాతావరణ అధికారులు చెబుతారు.