2019-20 ఆర్ధిక సంవత్సరంలో బీజేపీకి అత్యధికంగా విరాళాలు అందాయి. కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి ఐదు రెట్లు ఎక్కువగా విరాళాలు అందాయి.
న్యూఢిల్లీ: 2019-20 ఆర్ధిక సంవత్సరంలో బీజేపీకి అత్యధికంగా విరాళాలు అందాయి. కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి ఐదు రెట్లు ఎక్కువగా విరాళాలు అందాయి. కార్పోరేటు సంస్థలతో పాటు వ్యక్తిగతంగా వ్యక్తులు అందించిన విరాళాల వివరాలను రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి. అత్యధికంగా విరాళాలు పొందిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తమకు అందిన విరాళాల నివేదికను రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి. రూ.785.77 కోట్లు విరాళాలు అందినట్లు బీజేపీ ఎన్నికల సంఘానికి తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి రూ.139 కోట్లు విరాళాలుగా అందాయి. కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి ఐదు రెట్లు అధికంగా విరాళాలు వచ్చాయి.
పలు కార్పొరేట్ సంస్థల నుండి బీజేపీకి రూ.271 కోట్లు అందాయి. కాంగ్రెస్ రూ.139.01 కోట్లు విరాళంగా అందుకుంది. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రూ.58 కోట్లు విరాళాలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్‌కు తక్కువ నిధులే వచ్చాయి. సీపీఐ (ఎం)కు రూ.19.69 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.8.08 కోట్లు, సీపీఐకి రూ.1.29 కోట్లు, ఎన్సీపీకి రూ.59.94 కోట్లు వచ్చాయని. ఈ మేరకు ఆయా పార్టీలు తమ నివేదికలో ఎన్నికల సంఘానికి తెలిపాయి. తమకు నిధులు ఏమీ అందలేని బీఎస్పీ ఈసీకి వివరించింది.
తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు అత్యధికంగా రూ.130.46 కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రూ.92.7 కోట్లు విరాళాలు వచ్చాయి. మహారాష్ట్రలో శివసేనకు రూ.111.4 కోట్లు, ఒడిశాలో బీజేడీకి రూ.90.35 కోట్లు, తమిళనాడు ఏఐఏడీఎంకేకు రూ.89.6 కోట్లు, డీఎంకేకు రూ.64.90 కోట్లు విరాళాలు అందినట్లు ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి నివేదించాయి.
