యూనిఫామ్ లో ఫొటోలు తీసి, రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయకూడదని సీఆర్ పీఎఫ్ తన జవాన్లను కోరింది. పరిచయం లేని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తే స్వీకరించవద్దని కోరింది. హనీట్రాప్ కు గురి కాకుండా, సున్నిత సమాచారం లీక్  కాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

సోషల్ మీడియా వాడకంపై జవాన్లకు సీఆర్ పీఎఫ్ పలు ఆంక్షలు విధించింది. యూనిఫామ్ లో రీల్స్ చేయకూడదని, ఫొటోలు దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయకూడదని సూచించింది. అలాగే అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ లను పంపొద్దని, అలాగు యాక్సెప్ట్ చేయకూడదని తెలిపింది. హనీటాప్, సున్నితమైన సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందనే కారణంతో ఈ నిబంధనలు తీసుకొచ్చింది. 

సున్నిత ప్రాంతాల నుంచి పలువురు సిబ్బంది యూనిఫాంలో తమ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారని, పలువురు యూజర్లకు చాట్ మెసేజ్ లు, ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ లు పంపుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ మేరకు బలగాలకు లేఖ రాశారు. వివిధ పారామిలటరీ, పోలీసు బలగాలు, కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి లేఖను అందుకున్న తరువాత, తమ దళాలను అప్రమత్తం చేసేందుకు సీఆర్ పీఎఫ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సోషల్ మీడియా హెచ్చరిక ప్రకారం.. యూనిఫాంలో ఉన్న ఫోటో లేదా వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయకూడదని, అందులో అపరిచితులతో స్నేహం చేయవద్దని సీఆర్ పీఎఫ్ తన బలగాలను కోరింది. 

‘‘సీఆర్పీఎఫ్ జవాన్లు యూనిఫాంలో ఉన్న తమ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయడం, అపరిచిత వ్యక్తులతో స్నేహం చేయడం వంటివి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో చేస్తున్నట్టు గుర్తించారు. అందువల్ల అన్ని యూనిట్లు తమ ఆధీనంలో ఉన్న సిబ్బంది యూనిఫాంలో ఉన్న ఫొటోలు, వీడియోలను తమ సోషల్ మీడియా ప్రొఫైల్ లో పోస్ట్ చేయకుండా చూడాలని కాంపిటెంట్ అథారిటీ కోరింది. సోషల్ మీడియా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించండి. తెలియని వ్యక్తులతో సోషల్ మీడియాలో స్నేహం చేయొద్దు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే సంబంధిత వారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’’ అని అధికారిక నోట్ లో పేర్కొంది. 

ఇదిలా ఉండగా.. ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా కూడా తన దళానికి ఒక లేఖ రాశారు. ఏ అనుమానితుడు, అరెస్టయిన వ్యక్తి కి సంబంధించిన నేరం, నిర్దోషిత్వం, పెండింగ్ విచారణకు సంబంధించిన ఎలాంటి రహస్య సమాచారాన్ని ఎవరితో పంచుకోకూడదని, సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని, ప్రసారం చేయవద్దని, వ్యాప్తి చేయవద్దని కోరారు. బాధితులు, అనుమానితులు, మరే ఇతర వ్యక్తి లేదా సమూహాన్ని రెచ్చగొట్టే, కించపరిచే వ్యాఖ్యలను పోలీసులు పోస్ట్ చేయకూడదని తెలిపారు. పోలీసు సిబ్బంది విధి సమయంలో సోషల్ మీడియాను ఉపయోగించరాదని, సున్నితమైన సమాచారాన్ని అందులో అప్ లోడ్ చేయకూడదని పేర్కొన్నారు. 

కాగా.. ఇతర పారామిలిటరీ దళాలు కూడా గత కొన్ని రోజులుగా తమ సోషల్ మీడియా విధానాన్ని విడుదల చేశాయి. సున్నితమైన మోహరింపుల సమయంలో రీల్స్ చేయడం, సోషల్ మీడియాను ఉపయోగించడం మానుకోవాలని అన్ని దళాలను ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన సిబ్బందిని కోరాయి. బీఎస్ఎఫ్, ఐటీబీపీ వంటి దళాలు కూడా ఫార్వర్డ్ ప్రాంతాల నుంచి ఫోటోలను అప్లోడ్ చేయవద్దని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేయకూడదని తమ సైనికులను కోరాయి.

కొంత కాలం కిందట ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పాకిస్థాన్ లోని ఓ మహిళా ఇంటెలిజెన్స్ అధికారితో సన్నిహితంగా మెలిగినట్టు ‘హనీట్రాప్’ కేసు నమోదు అయ్యింది. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు తమను తాము సీనియర్ అధికారులుగా పరిచయం చేసుకుని వివిధ దళాల కంట్రోల్ రూమ్ లకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దళాలు తమ బలగాలకు తాజా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.