స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు వరుస సెలవులు రావడంతో ఈ వీకెండ్‌లో దేశీయ విమాన టికెట్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. గోవా, ఆగ్రా, కొచ్చి, మధురై, షిర్డీ, తిరుపతి వంటి ప్రాంతాలకు విమాన ఛార్జీలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు వరుస సెలవులు రావడంతో ఈ వీకెండ్‌లో దేశీయ విమాన టికెట్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో చాలా మంది సోమవారం సెలవు తీసుకుని శనివారం నుంచి మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడపాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ముంబై, ఢిల్లీల నుంచి దేశంలోని ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్‌లకు వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. దీంతో గోవా, ఆగ్రా, కొచ్చి, మధురై, షిర్డీ, తిరుపతి వంటి ప్రాంతాలకు విమాన ఛార్జీలు భారీగా పెరిగినట్లు జాతీయ వార్తాసంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
అయితే శ్రీనగర్ వంటి ప్రాంతాలకు వెళ్లే విమానాలకు టికెట్ల ధరలు చాలా తక్కువగా వున్నాయి. బుధవారం ఉదయం ముంబై నుంచి శ్రీనగర్‌కు 48 గంటల అడ్వాన్స్ బుకింగ్‌లో నాన్‌స్టాప్ ఫ్లైట్ ధర రూ.9,500. ఇదే సమయంలో దేశంలోనే అత్యంత రద్దీగా వుండే ముంబై - ఢిల్లీ మార్గంలో టికెట్ ధర రూ.12,500గా వుంది.
ఈ మార్గాల్లో టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో ప్రజలు ఈ లాంగ్ వీకెండ్‌లో మతపరమైన ప్రదేశాలకు తరలివెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సుప్రసిద్ధ హిందూ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతికి ముంబై నుంచి 48 గంటల ముందు బుక్ చేస్తే టికెట్ ధర రూ.18000గా వుండగా.. అదే ఢిల్లీ నుంచి రూ.25,000గా వుంది. ఒకవేళ జూన్ లేదా జూలైలో టికెట్లు బుక్ చేసుకుని వుంటే ప్రయాణీకులకు 20 నుంచి 25 శాతం తక్కువ ధరకే టికెట్లు దొరికేవని దేశీయ విమానయాన సంస్థ అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఏడాది జూన్‌లో ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఆసియా, పసిఫిక్, ఫ్లేర్ ఏవియేషన్ కన్సల్టింగ్ సహకారంతో ఈ ప్రాంతంలోని విమాన ఛార్జీల ట్రెండ్‌పై నిర్వహించిన ఒక అధ్యయనంలో భారతదేశంలో కోవిడ్ మొదలైన నాటి నుంచి 41 శాతం మేర పెరిగినట్లు తేలింది. 2023 తొలి త్రైమాసికంలో భారత్, ఇండోనేషియా, సౌదీ అరేబియాతో సహా అనేక మార్కెట్లలో దేశీయ విమాన ఛార్జీలు పెరుగుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది.
